దుష్టశక్తులను పారద్రోలే హనుమంతుడు

సాధారణంగా ఏదైనా గ్రామానికి వెళితే, ఆ గ్రామ ప్రవేశానికి ఆరంభంలోనే హనుమంతుడి ఆలయం కనిపిస్తూ వుంటుంది. తమ గ్రామాన్ని దుష్టశక్తుల బారి నుంచీ, అంటువ్యాధుల బారి నుంచి హనుమంతుడు కాపాడుతూ ఉంటాడనే విశ్వాసం ఆ కాలంలో ఎంతో బలంగా వుండేది. అందువల్లనే గ్రామంలోకి ప్రవేశించడానికి ముందుగా ఒక రక్షకుడిగా ఆయన దర్శనమిస్తూ వుంటాడు.

పనిమీద గ్రామం వదలి వెళ్లే వాళ్లు కార్యసిద్ధి కలిగేలా చూడమని హనుమంతుడికి నమస్కరించుకుంటూ వుంటారు. అలాగే పని పూర్తయి తిరిగివస్తూ ఆ స్వామికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వుంటారు. అలా భక్తులచే అపారమైన విశ్వాసాన్ని కలిగివున్న హనుమంతుడి క్షేత్రాల్లో ఒకటి 'ఆళ్లగడప' లో కనిపిస్తుంది. ఈ గ్రామం నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో కనిపిస్తుంది.

ప్రాచీనకాలం నాటి 'భక్తాంజనేయస్వామి' ఆలయం మనకి ఇక్కడ దర్శనమిస్తుంది. హనుమంతుడు స్వప్న సాక్షాత్కారమిచ్చి భక్తులను ఆదేశించడం వల్లనే, ఇక్కడ స్వామి ఆలయ నిర్మాణం జరిగిందని చెబుతారు. అందువలన స్వామి ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నాడని భక్తులు విశ్వసిస్తుంటారు. ఆయనని పూజిస్తే ఆ ఫలితం వెంటనే కనిపిస్తుందని చెబుతుంటారు. తమ గ్రామాన్నీ ... పాడిపంటలను ఆ స్వామి కాపాడుతూ ఉంటాడని స్థానికులు చెబుతుంటారు.

దుష్టశక్తుల కారణంగా బాధలుపడుతోన్నవాళ్లు ... దుస్వప్నాల వలన ఇబ్బందులు పడుతోన్నవాళ్లు స్వామి దర్శనానికి ఎక్కువగా వస్తుంటారు. ప్రతి మంగళ .. శనివారాల్లో స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా వుంటుంది. భయాందోళనలను ... అనారోగ్యాలను దూరంచేసే హనుంతుడిని భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తుంటారు. అంకిత భావంతో సేవిస్తూ తరిస్తుంటారు.


More Bhakti News