ఇలా హనుమంతుడిని మెప్పించవచ్చు
అనారోగ్యమనేది జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది. ఎంతటి సిరిసంపదలున్నా ఆరోగ్యం సరిగ్గా లేకపోతే అంతకుమించిన దుఃఖం మరొకటి వుండదు. అందువల్లనే ఆరోగ్యమే మహాభాగ్యమని అంటూవుంటారు. మానసికంగా .. శారీరకంగా కూడా అనారోగ్యమనేది ప్రశాంతత లేకుండా చేస్తుంటుంది. కుటుంబంలో ఎవరు అనారోగ్యం బారినపడినా, మిగతా వాళ్లంతా కూడా ఆ బాధను అనుభవిస్తూనే వుంటారు.
ఎవరైనా సరే భగవంతుడిని ముందుగా కోరేది ఆరోగ్యమే. అన్ని సంతోషాలు ... ఆనందాలు దానిపై మాత్రమే ఆధారపడి వుంటాయి. అలాంటి ఆరోగ్యం విషయంలో ఏ మాత్రం కాస్త తేడా వచ్చినా ... దీర్ఘకాలంగా అది వేధిస్తూ వున్నా అందరికీ హనుమంతుడే గుర్తుకువస్తాడు. అనారోగ్యాల కారణంగా బాధలుపడుతున్నవాళ్లు హనుమంతుడిని ఎక్కువగా ఆశ్రయిస్తుంటారు. ఆయనకి ఆకుపూజలు ... సిందూర అభిషేకాలు చేయిస్తుంటారు. ఇక ప్రతిరోజుగానీ ... మంగళవారాల్లోగాని ఆ స్వామికి ప్రదక్షిణలు చేస్తుంటారు.
ఇవన్నీ కూడా ఆ స్వామి అనుగ్రహాన్ని సంపాదించి పెట్టేవేననడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే పూజలతోనే కాదు సేవల ద్వారా కూడా భగవంతుడిని మెప్పించవచ్చని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అనునిత్యం హనుమంతుడి ఆలయానికి వెళ్లి, ఆ స్వామి ఆలయంలో శుభ్రంగా తుడవడం ... ముగ్గులు పెట్టడం వంటివి చేస్తూ వుండాలి. ఆయన ఆలయానికి తోరణాలుగానీ ... పూలమాలలు గాని కడుతూ వుండాలి. స్వామివారి ఉత్సవాల్లో శ్రమ సంబంధమైన సేవల్లో పాలుపంచుకుంటూ వుండాలి.
ఈ విధంగా స్వామివారికి సంబంధించిన సేవల్లో భక్తిశ్రద్ధలతో పాల్గొంటూ వుండటం వలన ఎలాంటి అనారోగ్యాలు దరిచేరవని చెప్పబడుతోంది. ఇక అనారోగ్యం బారినపడినవాళ్లలో కొంతమంది శరీరం సహకరించని వాళ్లు కూడా వుంటారు. అలాంటి వాళ్ల కోసం ఆ కుటుంబసభ్యులు సేవలు చేసినా ఆశించిన ఫలితం కనిపిస్తుందని స్పష్టం చేయబడుతోంది.