సిరిసంపదలను ప్రసాదించే అభిషేకం !
అభిషేకమంటే ఆదిదేవుడికి ఎంతో ఇష్టం. అభిషేకం జరుగుతూ వుంటే ఆయనకి కలిగే ఆనందం వేరు. అభిషేకం చేసే భక్తులకీ ... చూసే భక్తులకు కలిగే అనుభూతి వేరు. పరమశివుడికి చేసే అభిషేకం జన్మజన్మల పాపాలను కడిగేస్తుంది .. అనంతమైన పుణ్యఫలాలను అవలీలగా అందిస్తుంది. సాధారణంగా శివుడికి పంచామృతాలతోను ... పండ్లరసాలతోను అభిషేకం చేస్తుంటారు. ఆవుపాలు ..ఆవుపెరుగు ..ఆవునెయ్యి ... తేనె ... నీరును పంచామృతాలని అంటారు.
పంచామృతాలతో చేయబడే అభిషేకం సాక్షాత్తు పరమశివుడి వరాన్ని అందిస్తుంది. ఇక ఈ ఐదింటిలో ఒక్కో అభిషేక ద్రవ్యంతో చేసే అభిషేకం ఒక్కో విశేషమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. ఈ అభిషేక ద్రవ్యాలలో ఆవుపెరుగు ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది. ఆవు పెరుగుతో శివుడిని అభిషేకించడం వలన 'ఆరోగ్యం' కలుగుతుందని చెప్పబడుతోంది. అనారోగ్యాలు దరిచేరకుండా ఉండటం కోసం ఆ స్వామిని ఆవుపెరుగుతో అభిషేకిస్తూ వుండాలి.
ఇక ఆవుపెరుగును ఒక ఒక వస్త్రంలో వుంచి మూటకట్టి దానిలోని నీరంతాపోయేలా పిండి, ఆ వస్త్రంలో మిగిలిపోయిన మెత్తటి పదార్ధంతో శివలింగం తయారుచేసి పూజించవచ్చని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అలా పెరుగు నుంచి వచ్చిన మెత్తటి పదార్థంతో శివలింగం తయారు చేసుకుని దానిని పూజించడం వలన సిరిసంపదలు కలుగుతాయని చెప్పబడుతోంది. దారిద్ర్యం నుంచీ ... దాని వలన కలిగే దుఃఖం నుంచి విముక్తిని పొందాలనుకునేవాళ్లు, ఇలా పెరుగు నుంచి వచ్చే మెత్తటి పదార్థంతో శివలింగం తయారుచేసుకుని పూజించడం మరచిపోవద్దు.