భీష్మ ఏకాదశి రోజున విష్ణు ఆరాధన
ఆధ్యాత్మిక జీవనాన్ని ప్రభావితం చేస్తూ ఏడాదికి ఇరవైనాలుగు ఏకాదశులు వస్తుంటాయి. ఒక్కో ఏకాదశి ఒక్కో విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. ప్రతి ఏకాదశి కూడా అనంతమైన పుణ్యఫలాలను అందిస్తూ ఉత్తగతులు కల్పించేదే. అలాంటి ఏకాదశులలో 'భీష్మ ఏకాదశి' కూడా ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది.
స్వచ్చంద మరణాన్ని వరంగా కలిగివున్న భీష్ముడు, ఉత్తరాయణ పుణ్యకాలం వరకూ ఆగి, మాఘశుద్ధ అష్టమి రోజున పరమాత్ముడైన శ్రీకృష్ణుడిని స్మరిస్తూ శరీరాన్ని విడిచిపెట్టాడు. ఆయన గుర్తుగా కృష్ణుడు మార్గశుద్ధ ఏకాదశికి 'భీష్మఏకాదశి'గా పేరు పెట్టాడు. సమస్త పాపాలను హరించివేసి సకల శుభాలు చేకూర్చేదిగా ... ఉత్తమగతులను కల్పించేదిగా ఆయన ఈ ఏకాదశిని పేర్కొన్నాడు.
ఈ ఏకాదశి మహాత్మ్యాన్ని వివరిస్తూ అనేక ఆసక్తికరమైన కథనాలు వినిపిస్తూ వుంటాయి. వాటిలో పుష్పదంతుడు అనే గంధర్వుడి కథ ఒకటిగా కనిపిస్తుంది. పుష్పదంతుడు అనే గంధర్వుడు ... అతని భార్య దేవేంద్రుడి ఆగ్రహానికి కారకులవుతారు. ఆయన శాపం కారణంగా రాక్షసులుగా మారిపోతారు. ఆ దంపతులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి, శాపం నుంచి విముక్తిని పొందినట్టుగా ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
ఈ రోజున తెల్లవారు జామునే నిద్రలేచి తలంటుస్నానం చేసి ఇంటిని మంగళకరంగా అలంకరిస్తారు. పూజా మందిరంలో శ్రీమహావిష్ణువు ప్రతిమనుగానీ, చిత్రపటాన్నిగాని ఏర్పాటు చేసుకుని అత్యంత భక్తిశ్రద్ధలతో ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. స్వామివారిని ప్రీతికరమైన తులసిదళాలతో పూజించి ఆయనకి ఇష్టమైన పాయసాన్ని నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఈ విధంగా శ్రీమన్నారాయణుడి స్మరిస్తూ ... సేవిస్తూ ఉపవాసంతో కూడిన జాగరణం చేయడం వలన విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయని చెప్పబడుతోంది.