ఆయురారోగ్యాలను అందించే రథసప్తమి
లోకాన్ని ఆవరించిన చీకట్లు సూర్యభగవానుడి రాకతో తొలగిపోతుంటాయి. జీవులను అంటిపెట్టుకున్న బద్ధకం కూడా ఆయన రాకతోనే వదిలిపోతుంది. అందరికీ అవసరమైన చైతన్యాన్ని అందిస్తూ ఆయన కార్యోన్ముఖులను చేస్తుంటాడు. అందువల్లనే దేవతలు .. మహర్షులు .. సామాన్య మానవులు సూర్యభగవానుడుని ప్రత్యక్ష నారాయణుడిగా భావించి పూజిస్తుంటారు.
జీవకోటికి అవసరమైన ఆహారాన్ని ప్రకృతి ద్వారా సూర్యభగవానుడు సమకూరుస్తుంటాడు. ఆ ఆహారాన్ని సంపాదించుకునే శక్తిని కూడా ఆయనే జీవులకు కలిగిస్తుంటాడు. అలాంటి సూర్యభగవానుడిని 'మాఘమాసం'లో పూజించడం వలన కలిగే ఫలితం మరింత విశేషంగా ఉంటుంది. ముఖ్యంగా 'రథసప్తమి' రోజున సూర్యభగవానుడిని ఆరాధించడం వలన అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి.
మాఘశుద్ధ సప్తమిని రథసప్తమిగా జరుపుకుంటూ వుంటారు. తన బాధ్యతను నిర్వహించడం కోసం సూర్యభగవానుడు రథాన్ని అధిరోహించిన రోజుగా ఇది చెప్పబడుతోంది. ఈరోజున అరుణోదయ వేళలో నదీస్నానం చేయడం వలన సమస్త పాపాలు నశిస్తాయి .. వివిధరకాల వ్యాధులు దూరమవుతాయి. సూర్యభగవానుడికి 'అర్కుడు' అనే పేరు వుంది. ఆయన అనేక కిరణాలను వెదజల్లుతున్నప్పటికీ అందులో ఏడు కిరణాలు అత్యంత విశిష్టమైనవిగా చెప్పబడుతున్నాయి. ఇక సూర్యుడి రథం కూడా ఏడు గుర్రాలను కలిగి వుంటుంది.
అందుకు సంకేతంగానే ఏడుసంఖ్యగల అర్కపత్రాలు (జిల్లేడు ఆకులు) శరీరంపై ఏడు ప్రదేశాల్లో వుంచి స్నానం చేస్తుంటారు. ఈ రోజున సూర్యభగవానుడిని 'చిక్కుడు రథం' లోకి ఆవాహనచేసి, కొత్తబియ్యం .. కొత్తబెల్లంతో తయారుచేసిన 'పొంగలి'ని చిక్కుడు ఆకుల్లో నైవేద్యంగా సమర్పిస్తుంటారు. ఇక ఈ రోజున స్త్రీలు 'రథసప్తమి వ్రతం' చేస్తుంటారు. సూర్యభగవానుడితో పాటు శివపార్వతులను ఆరాధిస్తారు. ఈ విధంగా చేయడం వలన ఆయురారోగ్యాలు కలుగుతాయనీ, సౌభాగ్యం కలకాలం నిలుస్తుందని విశ్వసిస్తుంటారు.