భగవంతుడు ఇక్కడే ఉంటాడు !
భగవంతుడు ఎక్కడ ఉంటాడనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ సమయాన్ని వృథా చేసుకోవద్దు. భగవంతుడిని సేవించేవారి మనసులోనే ఆయన ఉంటాడని ఎంతోమంది మహానుభావులు సెలవిచ్చారు. ఎవరు సత్యధర్మాలను ఆశ్రయిస్తారో .. ఎవరు నిజమైన భక్తి శ్రద్ధలను కలిగి వుంటారో .. ఎవరు తమ అహంభావానికి దూరమై ఎదుటివారి ఆత్మాభిమానానికి విలువను ఇస్తారో అలాంటి వారందరి మనసులోనూ భగవంతుడు ఉంటాడు.
ఇలాంటి ఉదాత్తమైన గుణాలతో చరిత్రలో నిలిచిపోయిన మహానుభావులు ఎంతోమంది వున్నారు. అలాంటివారిలో 'శివాజీ మహారాజు' ఒకరుగా కనిపిస్తాడు. శివాజీ భవానీదేవి ఆరాధకుడు ... అమ్మవారిని పూజించిన తరువాతనే ఆయన తన దైనందిన కార్యక్రమాలు ప్రారంభించేవాడు. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించేవారిని శివాజీ ఎంతగానో అభిమానించేవాడు. తన సంతోషం కోసం వారికి ఖరీదైన కానుకలు పంపించేవాడు.
అలాగే ఒకసారి పాండురంగడి భక్తుడైన 'తుకారామ్' కి కూడా ఆయన కానుకలు పంపుతాడు. అయితే అయాచితంగా వచ్చే సొమ్మును తాను స్వీకరిస్తే పాండురంగడు హర్షించడంటూ తుకారామ్ సున్నితంగా తిరస్కరిస్తాడు. ఆయనచేసిన ఈ పని తప్పనిసరిగా శివాజీ మహారాజుకి ఆగ్రహాన్ని కలిగిస్తుందని అంతా అనుకుంటారు. తుకారామ్ కానుకలు స్వీకరించకుండా తిప్పిపంపిన విషయాన్ని అధికారులు శివాజీ దృష్టికి తీసుకువెళతారు.
అయితే అంతా అనుకున్నట్టుగా శివాజీ ఎంతమాత్రం ఆగ్రహావేశాలను వ్యక్తం చేయడు .. ఎలాంటి అహంభావాన్ని ప్రదర్శించడు. తుకారామ్ ఆత్మాభిమానాన్నీ తాను అభినందిస్తున్నాననీ ... అలాంటి మహానుభావుడిని తాను ప్రత్యక్షంగా దర్శించాలనుకుంటున్నానని అంటాడు. అందుకు అవసరమైన ఏర్పాట్లను చేయమని అధికారులను ఆదేశిస్తాడు. శివాజీ మహారాజు మహాభక్తుడు కావడం వలన ఆయన మరో భక్తుడి మనసును అర్థంచేసుకోగలిగాడు. అసమానమైన శౌర్యపరాక్రమాల కారణంగా ... ఆధ్యాత్మికపరంగా కూడా ఆయన చరిత్రలో చెరిగిపోని స్థానాన్ని సంపాదించుకోగలిగాడు.