అడిగిన వరాలనిచ్చే అమ్మవారు

ఆదిపరాశక్తి అయిన అమ్మవారు దుష్టశిక్షణ .. శిష్టరక్షణ కోసం వివిధ రూపాలను ధరించింది. దేవతలు ... మహర్షుల అభ్యర్థనమేరకు ఆ తల్లి అనేక ప్రాంతాలలో ఆవిర్భవించింది. అలా కొలువైన అమ్మవారిని భక్తులు తమ ఇలవేల్పుగా భావించి పూజిస్తూ వస్తున్నారు. అలా భక్తులచే నిత్యనీరాజనాలు అందుకుంటోన్న అమ్మవారి క్షేత్రాల్లో ఒకటి 'ఏలూరు'లో దర్శనమిస్తుంది.

ఏలూరులో 'జలాపరేశ్వరస్వామి' క్షేత్రం గురించి తెలియనివాళ్లు వుండరు. ప్రాచీనకాలంనాటి ఈ క్షేత్రం అలనాటి వైభవంతో పాటు, మహిమలను కూడా ఆవిష్కరిస్తూ ప్రసిద్ధిచెందింది. ఈ ప్రాంగణంలోనే అమ్మవారు 'మహిషాసుర మర్ధిని' గా భక్తులకు దర్శనమిస్తూ వుంటుంది. లోక కల్యాణకారకమైన అమ్మవారి రూపం శత్రుభయాన్ని నశింపజేస్తూ దర్శనమిస్తుంది. ఈ క్షేత్రానికిగల మహాత్మ్యం కారణంగా అమ్మవారు ఇక్కడ ప్రత్యక్షంగా కొలువైవుందని భక్తులు విశ్వసిస్తుంటారు.

ప్రతి శుక్రవారం అమ్మవారిని దర్శించే మహిళా భక్తుల సంఖ్య ఎక్కువగా వుంటుంది. ఈ రోజున అమ్మవారికి ప్రత్యేక అలంకారాలు ... పూజలు జరుగుతుంటాయి. ఈ పూజలో పాల్గొనడం వలన వివాహయోగం ... సంతాన సౌభాగ్యాలు కలుగుతాయని చెబుతుంటారు. అమ్మవారికి మొక్కుకుని ఆ తల్లికి ప్రదక్షిణలుచేస్తే అనారోగ్యాలు ... ఆర్ధికపరమైన సమస్యలు తొలగిపోతాయని అంటారు. ఆ తల్లి ఆశీస్సులు అందుకుని ఆరంభించిన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తవుతాయని విశ్వసిస్తుంటారు.

ఇక ఈ క్షేత్రంలో దేవీనవరాత్రులు అంగరంగవైభవంగా జరుగుతూ వుంటాయి. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని, ఆ తల్లికి కానుకలు ... మొక్కుబడులు సమర్పించుకుంటూ వుంటారు. జలాపరేశ్వరస్వామినీ ... అమ్మవారిని దర్శించుకున్నంత మాత్రాన్నే సమస్త పాపాలు నశించి సకలశుభాలు చేకూరతాయని ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.


More Bhakti News