విస్మయులను చేసిన నందీశ్వరుడి మహిమ !

పరమశివుడి వాహనం నందీశ్వరుడు. ఆ స్వామి ఎక్కడికి వెళ్లాలన్నా నందీశ్వరుడిపైనే ప్రయాణంచేస్తూ వుంటాడు. స్వామివారి సేవకి సిద్ధంగా ఆయన ఆదేశం కోసం నందీశ్వరుడు ఎదురుచూస్తూ వుంటాడు. అందువల్లనే ఏ శైవక్షేత్రానికి వెళ్లినా స్వామివారి గర్భాలయానికి ఎదురుగా నందీశ్వరుడు కూర్చుని కనిపిస్తుంటాడు. స్వామివారితో క్షణకాలం ఎడబాటుని కూడా ఆయన భరించలేడు. స్వామివారికి జరుగుతోన్న పూజాభిషేకాలను చూస్తూ నందీశ్వరుడు సంతోషంతో పొంగిపోతూ వుంటాడు.

కొన్ని క్షేత్రాల్లో సదాశివుడి మహిమలతోపాటు నందీశ్వరుడి మహిమలు కూడా వెలుగుచూస్తూ వుంటాయి. అలాంటి మహిమాన్వితమైన క్షేత్రాల్లో ఒకటి 'ఏలూరు'లో కనిపిస్తుంది. శివుడు ఇక్కడ 'జలాపరేశ్వరస్వామి' పేరుతో పూజాభిషేకాలు అందుకుంటూ వుంటాడు. ప్రాచీనకాలంనాటి ఈ క్షేత్రం భక్తులపాలిట కల్పతరువుగా చెప్పుకుంటూ వుంటారు. ఇక్కడ స్వామివారితో పాటు నందీశ్వరుడు కూడా ప్రత్యక్షంగా కొలువై వున్నాడని భక్తులు విశ్వసిస్తుంటారు. కొంతకాలం క్రితం జరిగిన ఒక సంఘటనను కూడా అందుకు నిదర్శనంగా చెబుతుంటారు.

ఇక్కడి నందీశ్వరుడి విగ్రహం కాలుకి ఎంతో విశేషాన్ని కలిగిన ఒక 'కడియం' వుండేదట. కొంతమంది దుండగుల కన్ను ఆ కంకణంపై పడింది. ఒకరాత్రి వేళ వాళ్లు ఆలయంలోకి ప్రవేశించి, నందీశ్వరుడి కాలును విరగ్గొట్టి ఆ కంకణాన్ని కాజేసి పారిపోయారు. మరునాడు ఉదయం ఆలయ అర్చకులు ... భక్తులు నందీశ్వరుడిని చూసి ఆశ్చర్యపోయారు. నందీశ్వరుడి కంకణం పోయినందుకే కాదు, విరిగిన కాలు నుంచి రక్తం వస్తుండటమే అందుకు కారణం.

అప్పట్లో ఈ వింతను స్థానికులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలవారు సైతం చూసి నివ్వెరపోయారు. ఎద్దుకాలు విరిగిపోయినప్పుడు ఎలా వుంటుందో. శిలా విగ్రహం కాలు విరిగినప్పుడు కూడా అలాగే వుండటం చూసి తమ కళ్లను తామే నమ్మలేకపోయారు. స్వామివారు ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నాడని నిర్ధారణ చేసుకున్నారు. ఆ తరువాత నందీశ్వరుడి కాలును తిరిగి అతికిచడం జరిగింది. ఇంతటి మహిమాన్వితమైనది కనుకనే ఈ క్షేత్రాన్ని దర్శించే భక్తులసంఖ్య ఎక్కువగా వుంటుంది. విశిష్టమైన ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయని భక్తులు విశ్వసిస్తుంటారు.


More Bhakti News