పుణ్యరాశిని పెంచే శివలింగార్చన
ఎవరి పుణ్యరాశిని పెంచుకోవడానికి వాళ్లు నిరంతరం ప్రయత్నిస్తూనే వుండాలి. ఈ జన్మలో చేసుకున్న పుణ్యం కారణంగానే ఆ తరువాత ఉత్తమమైన జన్మను పొందడం జరుగుతుంది. అందుకే ఎంతమాత్రం అవకాశం లభించినా వివిధ పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ వుండాలి. అక్కడి పుణ్యతీర్థాలలో స్నానమాచరిస్తూ వుండాలి.
భగవంతుడు స్వయంభువుగా ఆవిర్భవించి వుంటాడు కనుక పుణ్యక్షేత్రాల్లో దేవతలు .. మహర్షులు తిరుగాడుతూ వుంటారు. ఎంతోమంది మహాభక్తులు ... సాధు సత్పురుషులు అక్కడ సంచరిస్తూ వుంటారు. అలాంటి పుణ్యభూమిని స్పర్శించడానికి మించిన అదృష్టం లేదు. పుణ్యక్షేత్ర దర్శనం వలన సమస్తపాపాలు నశిస్తాయి.
ఇక ధర్మబద్ధంగా సంపాదించినది దానం చేయడమనేది పుణ్యరాశిని పెంచుకునే మరొక మార్గంగా కనిపిస్తూ వుంటుంది. దానగుణం కలిగినవాళ్లనే తనవాళ్లుగా భగవంతుడు భావిస్తూ ఉంటాడట. అందువలన తమశక్తిమేరకు ఇతరులకు దానంచేస్తూ వుండటం వలన పుణ్యఫలాలు విశేషంగా లభిస్తాయి. అయితే జీవితంలో కొన్ని పరిస్థితుల కారణంగా పుణ్యక్షేత్రాలను దర్శించలేకపోవడం, దానధర్మాలు చేయలేకపోవడం జరుగుతూ వుంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఆ పుణ్య ఫలితాలను పొందలేక పోయామనే బాధకలుగుతూ వుంటుంది.
శివలింగార్చన వలన అలాంటి బాధ నుంచి విముక్తిని పొందవచ్చని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. శివలింగానికి అనునిత్యం పూజాభిషేకాలు జరపడం వలన వివిధ పుణ్యక్షేత్రాలను దర్శించిన ఫలితం కలుగుతుందనీ, దానధర్మాలు చేసిన ఫలితం దక్కుతుందని స్పష్టం చేయబడుతోంది. అందుకే అనుదినం శివలింగానికి పూజాభిషేకాలు నిర్వహిస్తూ వుండాలి ... ఆదిదేవుడి అనుగ్రహంతో అనంతమైన పుణ్యఫలాలను పొందుతూ వుండాలి.