పాపాలను పారద్రోలే క్షేత్రం

సీతారాములు ధర్మమార్గాన్ని అనుసరించారు ... ఆదర్శవంతమైన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించారు. ఎన్నికష్టాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమించారు. అందువల్లనే సీతారాములపట్ల ప్రజలు అపారమైన ప్రేమాభిమానాలను పెంచుకున్నారు. వాళ్లని పూజించడానికి మించిన పుణ్యం లేదని విశ్వసించారు. ఈ కారణంగానే ప్రతి గ్రామంలోను సీతారాముల ఆలయం తప్పక దర్శనమిస్తూ వుంటుంది. ప్రతి ఇంట్లోను సీతారాముల చిత్రపటం కనిపిస్తూ వుంటుంది.

ఈ నేపథ్యంలో ప్రాచీనకాలం నుంచి తమ వైభవాన్ని కాపాడుకుంటూ వస్తోన్న రామాలయాలు ఎన్నో కనిపిస్తూ వుంటాయి. అలాంటి ప్రాచీనతను ఆవిష్కరిస్తూ వెలుగొందుతోన్న క్షేత్రాలలో 'పాండురంగాపురం' ఒకటిగా కనిపిస్తూ వుంటుంది. ఈ గ్రామం ఖమ్మం జిల్లా కేంద్రానికి సమీపంలో విలసిల్లుతోంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా వనవాసకాలంలో సీతారాములు తిరిగినవేనని చెబుతారు.

సువిశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ రామాలయం, ఒకనాటి వైభవానికి ప్రతీకగా కనిపిస్తూ వుంటుంది. ఇక్కడి స్థలమహాత్మ్యం గురించీ ... సీతారాములు ఇక్కడ కొలువైన తీరు గురించి ఆసక్తికరమైన కథనాలు వినిపిస్తూ వుంటాయి. ఇక్కడి స్వామివారిని భక్తులు తమ ఇలవేల్పుగా భావించి పూజిస్తుంటారు. వివాహం అనంతరం నూతన వధూవరులు సీతారాములను దర్శించి వారి ఆశీర్వాదం తీసుకోవడం ఒక ఆచారంగా వస్తోంది.

విశేషమైన రోజుల్లో సీతారాములకి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. శ్రీరామనవమి రోజున జరిగే కల్యాణమహోత్సవానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్దసంఖ్యలో తరలి వస్తుంటారు. సీతారాములను పూజించడం వలన, వివాహ యోగం .. సంతాన సౌభాగ్యాలు కలుగుతాయని విశ్వసిస్తుంటారు. ఈ క్షేత్ర మహాత్మ్యం కారణంగా ఇక్కడ అడుగుపెట్టగానే పాపాలు నశిస్తాయనీ,పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయని చెబుతుంటారు.


More Bhakti News