పుణ్యఫలాలు ఇలా దక్కుతాయి
కుటుంబసభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలను దర్శించడం, ప్రతిఒక్కరికీ సంతోషాన్నీ ... సంతృప్తిని కలిగిస్తుంది. ముఖ్యంగా విశేషమైన రోజుల్లో పుణ్యక్షేత్రాలను దర్శించడం వలన కలిగే పుణ్యం కూడా విశేషంగా వుంటుంది కాబట్టి, ఆ సమయంలో ఎక్కువగా వెళుతుంటారు. అయితే సమయాభావం వలన, ఇతర కారణాల వలన కొంతమంది దైవదర్శనం కాగానే తిరిగి బయలుదేరుతుంటారు.
అయితే ఆ రోజున వాహనసేవలు ఏవున్నాయో తెలుసుకుని, వాటిపై ఊరేగే భగవంతుడిని కనులారా దర్శించి బయలుదేరడం మరిన్ని శుభాలను కలిగిస్తుంది. శైవక్షేత్రాల్లో 'నందివాహన సేవ' ... 'రథోత్సవం' నయనానందకరంగా జరుగుతుంటాయి. ఇక వైష్ణవ సంబంధమైన క్షేత్రాల్లో అశ్వ .. గజ .. హనుమ .. గరుడవాహన సేవలు, రథోత్సవం అంగరంగవైభవంగా నిర్వహించబడుతుంటాయి.
భజనలు ... కోలాటాలు ... నృత్యాలుచేసే బృందాలతో ఈ వాహనసేవలు ముందుకి కదులుతుంటాయి. వివిధరకాల పూలహారాలతో అలంకరించబడిన ఈ వాహనసేవలు మనసుని భక్తిపారవశ్యంలో ముంచెత్తుతాయి. భగవంతుడి వైభవాన్ని ఇలాంటి ఉత్సవాల్లోనే చూడాలి. ఆయన లీలావిశేషాలను తలచుకుంటూ తరించాలి. ఒక్కో వాహనసేవ ఒక్కో విశిష్టతను సంతరించుకుని వుంటుంది. అలా ఒక్కో వాహనంపైగల భగవంతుడిని దర్శించడం వలన ఒక్కో విశేషమైన ఫలితం దక్కుతుంది.
ఉత్సవమూర్తిగా ఉత్సాహంగా తరలి వస్తోన్న భగవంతుడిని దర్శించుకోవడం వలన సమస్త పాపాలు పటాపంచలైపోతాయి. దోషాలు దూరమై కోరినవరాలు దక్కుతాయి. అందరూ ఆశించే సుఖశాంతులు స్వామి అనుగ్రహంతో చేరువవుతాయి. స్వామివారి ఉత్సవంలో పాల్గొనకపోవడమంటే, వరాలను ఇవ్వడానికి వస్తోన్న స్వామిని వదిలి వెళ్లిపోవడమే. అందుకే భగవంతుడికి సంబంధించిన ఉత్సవాల్లో తప్పకుండా పాల్గొనాలి. ఆయన వైభవాన్ని తిలకిస్తూ ... ఆయన కీర్తనలను ఆలకిస్తూ తరించాలి.