విశ్వాసమే సదా రక్షిస్తూ వుంటుంది

శిరిడీ సాయిబాబా ఆప్యాతానురాగాలకు తప్ప ఆడంబరాలకు ఎప్పుడూ ప్రాధాన్యతను ఇచ్చేవాడు కాదు. తన దర్శనం కోసం వచ్చినవారికి జీవితంలో ఉపయోగపడేలా రెండే రెండు మాటలు చెప్పేవాడు తప్ప పెద్దగా ఉపదేశాలు కూడా చేసేవాడు కాదు. గురువు మీదైనా ... భగవతుడి మీదైనా అపారమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలనీ, ఆ విశ్వాసమే జీవితాన్ని ముందుకి నడిపిస్తుందని చెప్పేవాడు.

అనారోగ్యాల విషయంలోనూ ... ఆపదల విషయంలోను ఆయనని విశ్వసించినవాళ్లు వాటి బారినుంచి బయటపడుతూ వుండేవాళ్లు. ఒకసారి బాబాను దర్శించడానికి కొంతమంది భక్తులు ఆయన మశీదుకి వస్తారు. బాబాతో కలిసి భోజనం చేయాలని వుందని భక్తులు కోరడంతో అందుకు ఆయన అంగీకరిస్తాడు. అంతా కలిసి భోజనం చేస్తూ వుండగా, సిధిలావస్థలో వున్న ఆ మశీదు పైకప్పు ఫెళఫెళమంటూ కూలబోతుంది.

బాబాపట్ల విశ్వాసంగల భక్తులు ఆయనపై భారంవేసి అలాగే కూర్చుంటారు. మిగతావాళ్లు మాత్రం భయంతో బయటికి పరుగులు తీస్తారు. అయితే మశీదు పైభాగం వైపు చూస్తూ కాస్త ఆగమని చెబుతాడు బాబా. బీటలువారిన పైకప్పు అలాగే ఆగిపోతుంది. బాబాతో పాటు ఆయన సహచరులు భోజనం చేసి బయటికి వచ్చాక ఆ పైకప్పు కూలిపోతుంది. బయటికి పరుగులు తీసినవాళ్లంతా ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసి నివ్వెరపోతారు. తాము బాబా సన్నిధిలో వున్నామనే విషయాన్ని ఆ క్షణంలో మరిచిపోయినందుకు బాధపడతారు.

బాబా చూపిన మహిమలలో ఈ సంఘటన ఒకటిగా కనిపిస్తూ వుంటుంది. భగవంతుడినైనా ... గురువునైనా మనసులోని కోరికను నెరవేర్చమని కోరుకోవడం వేరు. పాలముంచినా నీటముంచినా నీదే భారమనే అపారమైన విశ్వాసాన్ని కలిగి వుండటం వేరు. అసమానమైన ఆ విశ్వాసమే ఎలాంటి ఆపదలు ఎదురైనా వారిని కాపాడుతూ ఉంటుంది. ఇదే విషయాన్ని ఈ సంఘటన చాటిచెబుతూ వుంటుంది.


More Bhakti News