బాబా దర్శనంతో బాధల నివారణ !

ప్రేమానురాగాలకు ప్రతీకగా ... అడిగిన వరాలను అందించే దైవాంశ సంభూతుడుగా శిరిడీ సాయినాథుడు కనిపిస్తుంటాడు. శిధిలావస్థలో వున్న మశీదునే తన నివాసస్థానంగా చేసుకుని, అక్కడి నుంచే తన భక్తులను కాపాడుతూ వచ్చిన కరుణాసాగరుడు ఆయన. తాను భిక్ష చేస్తూ తనని నమ్మినవారికి అష్టైశ్వర్యాలు ప్రసాదించాడు. తన భక్తులు బాధపడకూడదనే ఉద్దేశంతో వారి వ్యాధులను తాను స్వీకరించాడు.

భక్తులు ఎంతగా తనని ఆరాధిస్తూ వుంటారో అంతగా ఆయన వాళ్లని ప్రేమించేవాడు. వాళ్లంతా తన కళ్లముందు వుంటే ఒక పండుగలా భావించి సంతోషపడేవాడు. బాబా సమాధిచెందిన తరువాత కూడా ఆయన కరుణా కిరణాలు తమపై ప్రసరిస్తూనే వున్నాయని భక్తులు విశ్వసిస్తుంటారు. అందువల్లనే అనేక ప్రాంతాలలో బాబా ఆలయాలు వైభవంగా విలసిల్లుతున్నాయి. అలాంటి క్షేత్రాల్లో నల్గొండ - రామగిరి ఒకటిగా కనిపిస్తుంది.

సువిశాలమైన ప్రదేశంలో భారీ నిర్మాణంగా ఇక్కడి ఆలయం దర్శనమిస్తుంది. ఆలయాన్ని అందంగా ... అధునాతనంగా తీర్చిదిద్దిన తీరు భక్తులను ఆకట్టుకుంటుంది. వేదికపై బాబా రాజాధిరాజుగా ... యోగిరాజుగా దర్శనమిస్తూ వుంటాడు. తన సన్నిధిలోకి అడుగుపెట్టిన తరువాత సమస్యలనేవి ఉండవని చెబుతున్నట్టుగానే ఆయన మూర్తి కనిపిస్తూ వుంటుంది. ఆలయాన్ని దర్శించే భక్తుల సంఖ్య చూస్తేనే, వాళ్ల హృదయాలను బాబా ఎంతగా గెలుచుకున్నాడనేది అర్థమైపోతుంది.

గురువారాల్లోను ... పర్వదినాల్లోను ప్రత్యేక పూజలు ... సేవలు ఘనంగా నిర్వహిస్తుంటారు. శిరిడీలో మాదిరిగానే ఇక్కడ అలంకారాలు ... హారతులు జరుగుతుంటాయి. మానసిక ప్రశాంతతను ప్రసాదించే ఆధ్యాత్మిక కేంద్రంగా ఈ ఆలయం అలరారుతోంది. బాబా పాదాలను ఆశ్రయించడం వలన, ఎలాంటి బాధలైనా దూరమైపోతాయని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు. ఆయన అనుగ్రహంతోనే అన్ని శుభాలు చేకూరతాయని ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.


More Bhakti News