ఇక్కడి స్వామికి మొక్కుకుంటే చాలు
పుణ్యఫలాలను ప్రసాదించే పుణ్యక్షేత్రాలను దర్శించడానికి అంతా ఆసక్తి చూపుతూనే వుంటారు. అలా ఆయా క్షేత్రాలను దర్శించినప్పుడు తమ భవిష్యత్తుకు అవసరమైన విషయాలను అక్కడి దైవానికి మనవి చేసుకుంటూనే వుంటారు. తమ మనసులోని కోరికను నెరవేర్చితే ఫలానా మొక్కుచెల్లిస్తానని మొక్కుకుంటూ వుంటారు. తమ కోరిక నెరవేరిన తరువాత స్వామివారికి ఇచ్చిన మాటప్రకారం మొక్కుచెల్లుస్తూ వుంటారు.
అయితే కొన్నిరకాల కోరికలు కొన్ని క్షేత్రాల్లో తప్పక నెరవేరతాయనే విశ్వాసం బలంగా వినిపిస్తూ వుంటుంది. దాంతో కోరికను బట్టి కూడా ఒక్కోసారి క్షేత్రదర్శనం చేయవలసివస్తూ వుంటుంది. ఆ క్షేత్రాన్ని దర్శించి మనసులోని కోరిక చెప్పుకుని మొక్కుకుంటేచాలు అది తప్పక నెరవేరుతుందని అంటారు. అలాంటి క్షేత్రాల జాబితాలో 'ర్యాలి' ఒకటిగా కనిపిస్తుంది. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం సమీపంలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. ఇది పురాణపరమైన ... చారిత్రకపరమైన విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది.
ఇక్కడి స్వామివారిని దర్శించడం వలన సకలశుభాలు చేకూరతాయని చెప్పబడుతోంది. స్వామివారిని 'బదిలీల దేవుడు' గా చెప్పుకోవడం ఇక్కడి విశేషంగా కనిపిస్తూ వుంటుంది. ఉద్యోగ రీత్యా కుటుంబానికి దూరంగా ఉండవలసి రావడం వలన, ప్రస్తుతం పనిచేస్తున్న చోట అనుకూలమైన వాతావరణం లేకపోవడం వలన కొంతమంది తమకి నచ్చిన చోటికి 'బదిలీ' చేయించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ విషయంలో అనేకరకాల ఆటంకాలు ఎదురవుతూ ఆలస్యమవుతున్నప్పుడు మరింత అసహనానికి లోనవుతుంటారు.
అలాంటి పరిస్థితుల్లో ర్యాలి జగన్మోహినీ కేశవస్వామిని దర్శించి మొక్కుకుంటే, బదిలీ కోసం వాళ్లు చేస్తోన్న ప్రయత్నాలు అనతికాలంలోనే ఫలిస్తాయని అంటారు. ఎంతోమంది అనుభవాలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. స్వయంభువుమూర్తి అయిన ఇక్కడి స్వామివారి మహిమలలో ఇది ఒకటిగా చెబుతున్నాయి.