ఈ రోజున సరస్వతీదేవిని పూజించాలి
జ్ఞానమే ఇతర జీవరాశుల నుంచి మానవుడిని వేరుచేసింది. మనిషికిగల మాట్లాడే శక్తియే అతణ్ణి అభివృద్ధి దశలో మరింత ముందుకు నడిపించింది. మనిషికి జ్ఞానసంపదనీ ... దానిని పెంచుకోవడానికి వాక్కును ప్రసాదించినది సాక్షాత్తు ఆ సరస్వతీ దేవియే. అందుకే ఆ తల్లిని 'వాగ్దేవి' గా పిలుస్తుంటారు. జ్ఞానమే అనంతమైన ఈ విశ్వాన్ని అర్థంచేసుకునే శక్తిని ప్రసాదిస్తుంది. జ్ఞానమే అభివృద్ధి పథంలో ముందుకునడిపిస్తుంది ... అన్నింటా గెలిపిస్తుంది.
అలాంటి జ్ఞానాన్ని ప్రసాదించే సరస్వతీదేవి సంగీతసాహిత్యాలకి అధిదేవతగా ... వేదస్వరూపిణిగా పూజలందుకుంటూ వుంటుంది. అలా విద్యను ... విజ్ఞానాన్నీ అందించే అమ్మవారిని 'శ్రీపంచమి' రోజున తప్పనిసరిగా పూజించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. మాఘశుద్ధ పంచమి ... శ్రీపంచమిగా చెప్పబడుతోంది. ఈరోజునే అమ్మవారు విద్యాధిదేవతగా ఆవిర్భవించింది.
అలాంటి ఈరోజున బ్రాహ్మీముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేయవలసి వుంటుంది. ఇంటిని శోభాయమానంగా అలంకరించి, పూజామందిరంలో అమ్మవారి ప్రతిమనుగానీ చిత్రపటాన్నిగాని ఏర్పాటుచేసుకుని పూజించాలి. ప్రశాంతతను ... పవిత్రతను ప్రతిబింబించే 'తెలుపురంగు' అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం. అందువలన అమ్మవారిని తెలుపురంగు పూలతో అర్చించాలి. పుస్తకాలు ... పెన్నులు ఈ పూజలో వుంచి తమని అనుగ్రహించమని అమ్మవారిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించాలి. అమ్మవారికి ఇష్టమైన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి.
ఈ విధంగా సరస్వతీదేవిని పూజించడం వలన విద్య ... విజ్ఞాన సంబంధమైన అన్ని విషయాల్లోనూ రాణించడం జరుగుతుంది. ప్రతిభాపాటవాలు పెరిగి తగిన గుర్తింపును పొందడం జరుగుతుంది. ఈరోజున అమ్మవారి ఆలయాలను దర్శించడం ... ఆ తల్లికి పూజభిషేకాలు జరిపించడం ఆశించిన ఫలితాలను ఇస్తుంది.