భగవంతుడిని కదిలించేది భక్తి మాత్రమే
ఆలయాలను దర్శించడం ... ఆధ్యాత్మిక చింతనలో తరించడం వయసైపోయినవాళ్లు చేయవలసిన పనులని కొంతమంది అనుకుంటూ వుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలను గురించి వాళ్ల దగ్గర ప్రస్తావిస్తే, తాము ఆ మార్గాన్ని అనుసరించడానికి చాలా సమయముందని అంటూవుంటారు. సరదాగా సంతోషంగా గడుపుతున్నామనే భ్రమలో దైవారాధనకి దూరమైపోతుంటారు.
నిజానికి భగవంతుడిని పూజించడానికీ ... ఆయనని సేవించడానికి వయసుతో సంబంధం లేదు. భక్తిశ్రద్ధలతో సేవిస్తూ ఎవరు పిలిచినా ఆయన పలుకుతాడు. ఎవరు కొలిచినా కొండంత అండగా నిలుస్తాడు. చిన్నతనంలోనే అసమానమైన భక్తిని ప్రదర్శించి, భగవంతుడి సాక్షాత్కారాన్ని పొందిన బాలభక్తులనే అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్రహ్లాదుడి భక్తికి మెచ్చిన శ్రీమన్నారాయణుడు, తన భక్తుడికి గల విశ్వాసాన్ని నిలబెట్టడం కోసం అతను చూపిన ప్రదేశంలో నుంచే నరసింహుడుగా అవతరించాడు.
ఇక తన తండ్రి తొడపై కూర్చోవాలనే ముచ్చట తీరడం కోసం 'ధృవుడు' చేసిన తపస్సుకి శ్రీమన్నారాయణుడే దిగివస్తాడు. ముందుగా ధృవుడిని తన తొడపై కూర్చోబెట్టుకుని అనుగ్రహిస్తాడు. తాను అల్పాయుష్కుడినని తెలుసుకున్న 'మార్కండేయుడు' .. తల్లిదండ్రుల ఆనందాన్ని ఆశించి, పరమశివుడిని గురించి కఠోర తపస్సు చేస్తాడు. చిరంజీవిగా ఆ సదాశివుడిని పూజించే భాగ్యాన్ని పొందుతాడు.
ఇక చిరుతొండనంబి కుమారుడైన 'శిరియాళుడు' కూడా బాల్యంలోనే శివభక్తి తత్పరుడై నడచుకునేవాడు. ఆ బాలుడిని పరీక్షించడానికి సదాశివుడు వస్తే, తన దేహం పరమశివుడికి ఆహారమైపోవడంకన్నా ఆనందం లేదంటూ ఆయననే ఆశ్చర్యపరిచి అనుగ్రహాన్ని పొందుతాడు. ఇలా బాల్యంలోనే వాళ్లంతా భగవంతుడిపట్ల అసమానమైన భక్తివిశ్వాసాలను ప్రదర్శించారు. భగవంతుడిని సేవించకుండా కాలాన్ని వృధా చేయవద్దనే విషయాన్ని లోకానికి చాటిచెప్పారు.