గురువును చూపించేది భగవంతుడే !

అజ్ఞానమనేది తన గురించి తాను తెలుసుకోకుండా ... భగవంతుడి తత్త్వాన్ని అర్థం చేసుకోకుండా అడ్డుపడుతూ వుంటుంది. అందువలన మనసు తాత్కాలికమైన సుఖాలవైపుకే లాగుతూ, భగవంతుడిపై దృష్టిలేకుండా చేస్తుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అనుకోకుండా జరిగే కొన్ని సంఘటనలు భగవంతుడి గురించిన ఆలోచన కలిగేలా చేస్తాయి. దైవదర్శనానికి ఆలయానికి వెళ్లడం ..ఆయన కీర్తనలు ... భజనలు వినడానికి ఆసక్తిని చూపడం జరుగుతూ వుంటుంది.

శాశ్వతమైన సుఖశాంతులను అందించే భగవంతుడి పాదపద్మాలపైకి ఎప్పుడైతే దృష్టి వెళ్లిందో, అప్పుడు తన గురించి తెలుసుకునే అవకాశాన్ని భగవంతుడు వారికి కల్పిస్తాడు. అద్దంపైగల దుమ్మును తుడిచేసినప్పుడే రూపం స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే అలుముకున్న అజ్ఞానాన్ని తొలగించినప్పుడే భగవంతుడి సన్నిధిలోగల సంతోషాన్ని గురించి తెలుస్తుంది. అందువల్లనే భగవంతుడు అలాంటివారిని సాధుసత్పురుషుల సమీపానికి చేరుస్తాడు.

సత్పురుషుల బోధనల వలన ... వారి జీవనవిధానాన్ని గమనించడం వలన అజ్ఞానాంధకారం తొలగిపోతుంది. ఎప్పుడైతే అజ్ఞానాంధకారం తొలగిపోతుందో అప్పుడు వెలుగుతూ వుండే జ్ఞానజ్యోతిలో భగవంతుడి రూపం స్పష్టంగా కనిపిస్తుంది. సర్వమూ భగవంతుడే ... సమస్తాన్ని నడిపించేది భగవంతుడే అనే విషయం అర్థమవుతుంది. తాను నిమిత్తమాత్రుడననే నిజాన్ని గ్రహించి, భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని సార్థకం చేసుకోవాలనే సంకల్పం కలుగుతుంది.

భగవంతుడి సమీపానికి చేరుకోవాలని ఆరాటపడిన ఎంతోమందికి ఆ స్వామి స్వప్నదర్శనమిచ్చి, ఫలానా గురువును ఆశ్రయించమని చెప్పిన సందర్భాలు ఎన్నో వున్నాయి. అలా గురువులను ఆశ్రయించి .. వాళ్లు చూపిన మార్గంలో ప్రయాణిస్తూ భగవంతుడిని ప్రత్యక్షంగా దర్శించిన భక్తులూ ఎంతోమంది వున్నారు. భగవంతుడిని చేరుకునే మార్గాన్ని చూపించేది గురువు ... ఆశ్రయించమంటూ ఆ గురువును చూపించేదీ భగవంతుడు కావడమే విశేషం.


More Bhakti News