కష్టాల నుంచి గట్టెక్కించే వినాయకుడు

సాధారణ మానవుల నుంచి మహర్షులు ... దేవతలు సైతం వినాయకుడిని ఆరాధిస్తూ వుంటారు. తనని ప్రార్ధించినవారి విషయంలో వినాయకుడు తక్షణమే స్పందిస్తూ వుంటాడు ... మనోభీష్టం నెరవేరేలా చేస్తుంటాడు. ఆయనని తలచుకున్నంత మాత్రాన్నే ఎవరు ఎలాంటి ఆటంకాన్నయినా అధిగమించగలరు.

కరుణతో కూడిన ఆయన చూపు సోకిన వెంటనే కార్యసిద్ధి కలుగుతుంది. అందువల్లనే భక్తులు వినాయకుడి ఆలయాలను దర్శిస్తూ వుంటారు ... తమ మనసులోని మాటను విన్నవిస్తూ వుంటారు.అలా భక్తుల అపారమైన విశ్వాసాన్ని చూరగొన్న వినాయక ఆలయాలు వివిధ ప్రాంతాలలో విలసిల్లుతున్నాయి. అలాంటి వినాయకుడి ఆలయాలలో ఒకటి 'జైపూర్'లో కనిపిస్తుంది. ఈ ప్రాంతంలోగల విశిష్టమైన క్షేత్రాల్లో ఇది ఒకటిగా దర్శనమిస్తుంది.

ఇక్కడ వినాయకుడు కొలువై వుండటం వెనుక ఆసక్తికరమైన కథనాలు వినిపిస్తూ వుంటాయి. పూర్వం వినాయక విగ్రహాన్ని ఈ ప్రాంతం మీదుగా తరలిస్తుండగా, విగ్రహాన్ని ఉంచిన వాహనం ఈ ప్రదేశానికి చేరుకోగానే ఆగిపోయిందట. ఎంతగా ప్రయత్నించినా అది ముందుకి కదలకపోవడంతో, స్వామివారు ఈ ప్రదేశంలో ఉండటానికి నిర్ణయించుకున్నాడని భావించి ఆయనని అక్కడ ప్రతిష్ఠించినట్టు స్థలపురాణం చెబుతోంది.

స్వామివారు ఇష్టపడి ఇక్కడ కొలువైన కారణంగా ఈ క్షేత్రంలో ఆయన ప్రత్యక్షంగా ఉన్నాడని భక్తులు విశ్వసిస్తుంటారు. ఆయన ఆశీస్సులతోనే శుభకార్యాలకు శ్రీకారం చుడుతుంటారు. వినాయకుడికి ఇష్టమైన బుధవారం రోజున ఆయనకి ప్రత్యేక పూజలు ... సేవలు నిర్వహిస్తుంటారు. ఈ రోజున స్వామివారి దర్శనం చేసుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా వుంటుంది. ఇక్కడి స్వామివారిని పూజిస్తే ఎలాంటి కష్టాలైనా అనతికాలంలోనే తీరిపోతాయనీ, సుఖశాంతులతో కూడిన జీవితం లభిస్తుందని చెబుతుంటారు.


More Bhakti News