హనుమ అనుగ్రహాన్ని అందించే చాలీసా
హనుమంతుడు మహాబల సంపన్నుడు. ఎంతోమంది దేవతల ఆశీస్సులను ... శక్తులను ఆయన వరాలుగా పొందాడు. సీతారాములకు సంతోషాన్ని కలిగించిన హనుమంతుడు వారి మనసును గెలుచుకున్నాడు. అందువలన హనుమంతుడిని పూజించడం వలన సీతారాములు కూడా ప్రసన్నులవుతారని చెప్పబడుతోంది. హనుమంతుడు శ్రీరామచంద్రుడిని ఎంతటి అంకితభావంతో సేవిస్తుంటాడో, తన భక్తులను ఆయన అంతటి విశాలమైన మనసుతో అనుగ్రహిస్తుంటాడు.
అనారోగ్యంతో బాధపడుతోన్నవాళ్లు హనుమంతుడిని ఎక్కువగా ఆరాధిస్తూ వుంటారు. ఆ స్వామి కొలువైన ఆలయాలను దర్శిస్తూ వుంటారు. మానసికపరమైన ... శారీరక పరమైన అనారోగ్యంతో బాధలుపడుతోన్నవాళ్లు హనుమంతుడికి ప్రదక్షిణలు చేస్తుంటారు. హనుమంతుడికి ప్రీతికరమైన ఆకుపూజ .. సిందూర అభిషేకం చేయిస్తుంటారు. ఇవన్నీ చేస్తూ అనునిత్యం 'హనుమాన్ చాలీసా' పఠిస్తూ వుండటం వలన, ఆశించిన ఫలితం మరింత త్వరగా కనిపిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
కొంతమంది తమకి తెలియకుండానే మానసికపరమైన ఆందోళనకీ ... ఏదో తెలియని భయానికి లోనవుతుంటారు. ఏదో జరిగిపోతున్నట్టుగా కంగారుపడిపోతుంటారు. తులసీదాస్ చే రచించబడిన హనుమాన్ చాలీసా అత్యంత శక్తిమంతమైనదిగా ... మహిమాన్వితమైనదిగా చెప్పబడుతోంది. అనునిత్యం 'హనుమాన్ చాలీసా'ను ఒక నియమంగా పెట్టుకుని నిష్ఠగా పఠిస్తే, అది హనుమంతుడి అనుగ్రహాన్ని వెంటనే అందిస్తుంది. మానసికపరమైన అనారోగ్యంతో బాధపడుతోన్నవారికి హనుమాన్ చాలీసా పఠనం తిరుగులేని ఔషధంగా ప్రభావం చూపుతుందని స్పష్టం చేయబడుతోంది.