మల్లెపూలతో మహాదేవుడి అర్చన !
ఆదిదేవుడు తన భక్తుల అభీష్టం మేరకు అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించాడు. అక్కడి భక్తులు తమ శక్తికొద్దీ ఏవి సమర్పిస్తే అవి ప్రేమతో ఆయన స్వీకరిస్తూ వుంటాడు. ఆయన అనుగ్రహమే జీవితానికి ధన్యతను ప్రసాదిస్తుంది. అందువలన ఆయన కొండకోనల్లో ... గుహల్లో ... సొరంగ మార్గాల్లో ... ఎక్కడ కొలువైనా, భక్తులు వెతుక్కుంటూ వెళుతుంటారు. ఆయనకి కొండప్రదేశాల్లో లభించే పూలన్నా మహాఇష్టం కనుక, సంతోషంతో వాటిని సమర్పిస్తుంటారు.
స్వామివారి అభిషేకానికిగాను వివిధరకాల అభిషేక ద్రవ్యాలు వాడినట్టుగానే, ఆయన అర్చనకి అనేక రకాల పూలు ఉపయోగించబడుతూ వుంటాయి. ఉమ్మెత్త పూలు .. గన్నేరుపూలు .. అవిసెపూలు .. జిల్లేడుపూలు .. కొండగోగు పూలు .. ఇలా ఎన్నోరకాల పూలు ఆదిదేవుడికి ప్రీతికరమైనవిగా చెప్పబడుతున్నాయి. ఈ పూలతో పరమశివుడిని అర్చించడం వలన కలిగే ఫలితాలు విశేషంగా ఉంటాయి.
ఒక్కో రకం పూలతో స్వామివారిని పూజించడం వలన లభించే ఫలితం ఒక్కోవిధంగా వుంటుంది. ఈ నేపథ్యంలో 'మల్లెపూలు' కూడా స్వామివారి పూజలో ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంటాయి. 'మాఘశుద్ధ చవితి (కుందచతుర్థి) రోజున శివుడిని మల్లెపూలతో పూజించడం మరింత విశేషమని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. విశిష్టమైన రోజుల్లో ప్రీతికరమైన పూలతో చేసే ఆరాధన, ఆ స్వామిని ప్రసన్నుడిని చేస్తాయి. అలాంటి విశేషాన్ని సంతరించుకున్న కుందచతుర్థి రోజున మల్లెపూలతో స్వామివారిని అర్చించడం వలన, సంపదలతో పాటు సకలశుభాలు చేకూరతాయి.