మహాదేవుడి సేవయే మహాభాగ్యం
జీవితం ఎప్పటికప్పుడు అనూహ్యమైన మలుపులు తిరుగుతూ సాగిపోతుంటుంది. ఏ క్షణాన ఏంజరిగేది ఎవరికీ తెలియదు. ఊహించని విధంగా కష్టాలు నష్టాలు ఎదురవుతూ వుంటాయి. ఆపదలు ... అనారోగ్యాలు పలకరిస్తూ వుంటాయి. ఒక్కసారిగా చుట్టుముట్టిన సమస్యలు మానసికంగా ... శారీరకంగా బాధిస్తూ వుంటాయి. ఇలాంటి పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో తెలియక సతమతమైపోవడం జరుగుతుంటుంది.
గతంలో తెలిసీ తెలియక చేసిన పాపాల ఫలితమే ప్రస్తుతం తాము అనుభవిస్తోన్న కష్టాలకి కారణమని గ్రహించినవాళ్లు, పుణ్యకార్యాలు జరపడంపట్ల ఆసక్తిని చూపడం ఆరంభిస్తుంటారు. అలాంటివారికి సదాశివుడి సేవయే సాధనంగా చెప్పబడుతోంది. అనునిత్యం సదాశివుడి నామాన్ని స్మరిస్తూ ఆయన లీలలను తలచుకుంటూ ... ఆయనని సేవించేవారిని ఎలాంటి కష్టాలు సమీపించలేవు.
శివతత్త్వాన్ని అర్థంచేసుకుని అంకితభావంతో ఆయనని అర్చిస్తూ ... అందరిలోనూ ... అన్నింటిలోను ఆయననే దర్శిస్తూ వుండాలి. అలాంటి భక్తులకి శత్రువుల వలనగానీ, దుష్టశక్తుల వలనగాని ఎలాంటి భయాలు లేకుండా పరమశివుడు కాపాడుతూ వుంటాడు. అనారోగ్యాలుగానీ, ఆపదలుగాని దరిచేరకుండా ఆ సదాశివుడు రక్షిస్తూ ఉంటాడని చెప్పబడుతోంది. సకల సంపదలు ... సంతోషాలతో పాటు శివలోకాన్ని చేరుకునే భాగ్యాన్ని ఆయన అనుగ్రహిస్తాడని స్పష్టం చేయబడుతోంది