ఆలుమగలు సాక్షాత్తు ఆదిదంపతులే !

జీవితంలో అభివృద్ధినీ ... ఆనందాన్ని అందించేది విజయమే. అలాంటి విజయాన్ని అందుకున్నప్పుడు బయలుదేరిన వేళావిశేషమని అనుకుంటూ వుంటారు. మంచిశకునం చూసుకుని బయలుదేరడం వల్లనే అనుకున్న పనులన్నీ చకచకా పూర్తయ్యాయని విశ్వసిస్తుంటారు. తలపెట్టినకార్యాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తికావాలంటే, మంచిశకునం చూసుకుని బయలుదేరాలనేది ప్రాచీనకాలం నుంచి వుంది.

శుభప్రదమైన కొత్తపనులకు శ్రీకారంచుట్టడం ... ఆ పనులపై బయలుదేరుతుండటం సహజంగా జరుగుతూ వుంటుంది. భగవంతుడికి నమస్కరించుకున్నప్పటికీ, మంచిశకునం చూసుకునే కాలు బయటికి పెడుతుంటారు. ఈ నేపథ్యంలో కొంతమంది తమ కుటుంబసభ్యులలోనే ఎవరో ఒకరిని ఎదురురమ్మని చెబుతుంటారు. అయితే సహజంగా ఎదురువచ్చే శకునం చూసుకుని బయలుదేరడమే సరైనదని శాస్త్రం చెబుతోంది.

సాధారణంగా ఎవరైనా ముత్తయిదువులు ఏదైనా వేడుకకి వెళుతూనో ... వస్తూనో ఎదురుగా వస్తే, శుభశకునంగా భావించి బయలుదేరుతుంటారు. శుభకార్యాల్లో ముత్తయిదువులు ముందుంటారు. వాళ్లు సాక్షాత్తు పార్వతీదేవి రూపాలనీ, వాళ్ల ఆశీస్సులు ఆశించిన ఫలితాలను ఇస్తాయని విశ్వసిస్తుంటారు. అందువలన ముత్తయిదువులు ఎదురురాగానే ఎలాంటి సందేహం లేకుండా బయలుదేరుతుంటారు.

ఈ నేపథ్యంలో భార్యాభర్తలు ఎదురుగా వచ్చినా, శుభప్రదమైన శకునంగా భావించి బయలుదేరవచ్చని చెప్పబడుతోంది. భార్యాభర్తలు సాక్షాత్తు ఆదిదంపతులుగా భావించబడుతుంటారు. వాళ్లు ఆనందంగా మాట్లాడుకుంటూ ఎదురుగా రావడం ఆదిదంపతుల ఆమోదాన్ని సూచిస్తుంది. అందువలన అది శుభప్రదమైన శకునంగా భావించి బయలుదేరడం వలన ఆశించిన ఫలితం లభిస్తుందని చెప్పబడుతోంది.


More Bhakti News