స్వామివారి అనుగ్రహం ఇలా కలుగుతుంది !

సాధారణంగా ఎవరు ఏ పుణ్యక్షేత్రానికి వెళ్లినా అక్కడి దైవానికి మనసులో మాట చెప్పుకోవడం జరుగుతూ వుంటుంది. తమకోరిక నెరవేర్చినట్టయితే ఫలానా మొక్కుబడి చెల్లిస్తామని చెప్పుకుంటూ వుంటారు. స్వామి అనుగ్రహంతో ఆ కోరిక నెరవేరితే, ఆ తరువాత ఆ పుణ్యక్షేత్రానికి కుటుంబసమేతంగా వచ్చి, అనుకున్న ప్రకారంగా ఆ మొక్కు చెల్లించడం జరుగుతుంది.

ఇలా ఆరోగ్యం కోసం ... ఆర్ధికపరిస్థితి మెరుగుపడటం కోసం ... సంతాన సౌభాగ్యాల కోసం భగవంతుడి పాదాలను ఆశ్రయించడం జరుగుతుంది. ఇక సంతానాన్ని కోరుకునే దంపతులు సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రాలను ... వేణుగోపాలస్వామి క్షేత్రాలను ఎక్కువగా దర్శిస్తూ వుంటారు. సుబ్రహ్మణ్యస్వామికి అభిషేకం జరిపించడం వలన, సంతానయోగానికి అడ్డుపడుతోన్న దోషాలు ఆయన అనుగ్రహంతో తొలగిపోతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

ఇక సంతానలేమితో బాధపడుతోన్న భక్తులు వేణుగోపాలస్వామిని దర్శించి, తమ ఆవేదనను వ్యక్తం చేస్తుంటారు. భక్తుల ఆవేదనను అర్థంచేసుకుని వారికి సంతానభాగ్యాన్ని కలిగిస్తూ ఉంటాడు గనుకనే, చాలాక్షేత్రాల్లో ఆయనని సంతాన వేణుగోపాలుడుగా పిలుచుకుంటూ వుంటారు. ఏ దైవానికి ఏది ప్రీతికరమో తెలుసుకుని దానిని సమర్పించడం వలన ఆ దైవం యొక్క అనుగ్రహం అనతికాలంలో కలుగుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

కృష్ణుడికి 'వేణువు'అంటే ప్రాణం .. అందుకే ఆయన వేణువుతోనే కనిపిస్తుంటాడు. గోపికలను ... గోపాలకులను మంత్రముగ్ధులను చేసినది ఆ వేణుగానంతోనే. వేణువు వాయిస్తూ స్వామివారు కొలువుదీరిన క్షేత్రాల్లో ఆయనని వేణుగోపాలుడిగా కొలుస్తుంటారు. అలాంటి క్షేత్రాలను దర్శించినప్పుడు స్వామివారికి వేణువును సమర్పించడం మంచిదని అంటారు. వేణుగోపాలుడికి వేణువు ప్రీతికరమైనది కనుక, అలాంటి వేణువును ఆయనకి కానుకగా సమర్పించడం వలన సంతానభాగ్యం కలుగుతుందనీ, మనోభీష్టం నెరవేరుతుందని చెప్పబడుతోంది.


More Bhakti News