ముందుజన్మ గురించిన ముందుచూపుండాలి !

గడిచిన ప్రతిక్షణం గతంలోకి జారిపోతూనే వుంటుంది. ఏ విషయాన్ని అశ్రద్ధచేసినా ... ఆగిపోయినా .. కాలం మాత్రం కరిగిపోతూనే వుంటుంది. నిజం తెలుసుకుని మేలుకునేసరికి జరగవలసినది జరిగిపోతూ వుంటుంది. సాధారణంగా ఎక్కడికైనా వెళ్లినప్పుడు చీకటిపడేలోగా ఇల్లుచేరుకోవాలనే ఆలోచనతో పనులు పూర్తిచేసుకోవడం జరుగుతుంటుంది.

అలాగే రానున్నది వర్షాకాలం కాబట్టి, ప్రకృతి ప్రతికూలించినా ఇబ్బందిపడకుండా వుండటం కోసం అవసరమైన ఆహారపదార్థాలను ముందుగానే జాగ్రత్తచేసుకోవడం జరుగుతుంటుంది. రేపటి రోజున ఇబ్బందిపడకుండా జాగ్రత్త చేసుకుంటున్నట్టుగానే, ముందుజన్మలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అందుకు అవసరమైన పుణ్యాన్ని సంపాదించుకోవాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

ఈ జన్మలో దైవకార్యాలు జరిపించడం వలన, వచ్చేజన్మలోను భగవంతుడికి సమీపంగా వుండే అవకాశం కలుగుతుంది. నీరు ... ఆహారం దానం చేయడం వలన వచ్చేజన్మలో వాటికోసం వెతుక్కోవలసిన పరిస్థితి రాకుండా పోతుంది. అలాగే ఇతరులకి ఆశ్రయం కల్పించడం వలన వచ్చేజన్మలో రక్షణనిచ్చే 'గూడు' దొరుకుతుంది. ఇలా ఏదైతే దానంగా ఇస్తామో, అది పుణ్యఫలితంగా మారి వచ్చేజన్మలో దక్కుతూ వుంటుంది.

అందువల్లనే వచ్చేజన్మను దృష్టిలో పెట్టుకుని ఈ జన్మలో పుణ్యకార్యాలు నిర్వహించవలసి వుంటుంది. ఈ జన్మలో కుటుంబపరమైన తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూనే పుణ్యకార్యాలలో పాల్గొనవచ్చు. దానధర్మాల వలన పుణ్యరాశి పెరగడం ... ఎలాంటిలోటు లేని ఉత్తమజన్మలు పొందడం జరుగుతూ వుంటుంది. ముందుజన్మకి ఎవరూ తోడురారు కనుక, ఈ జన్మలోనే జాగ్రత్తపడుతూ, తమ పుణ్యరాశిని తామే పెంచుకోవాలనే విషయాన్ని మరచిపోకూడదు.


More Bhakti News