భగవంతుడి అనుగ్రహాన్ని పొందిన భక్తుడు
రావణుడి సోదరుడే అయిన విభీషణుడు ... శ్రీరాముడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడని విశ్వసిస్తాడు. సీతమ్మతల్లిని అప్పగించి రాముడి పాదాలను ఆశ్రయించమని రావణుడికి ఎన్నో విధాలుగా చెబుతాడు. అయినా రావణుడు వినిపించుకోకపోవడంతో,లంకానగర శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని తానే రాముడి పాదాలను ఆశ్రయిస్తాడు. రావణుడిపై రాముడు విజయాన్ని సాధించడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాడు.
యుద్ధసమయంలో రావణుడి కుమారుడైన 'మేఘనాథుడు' ... యజ్ఞంచేస్తూ వుంటాడు. ఆ విషయం తెలుసుకున్న విభీషణుడు ఆందోళన చెందుతాడు. మేఘనాథుడుకి బ్రహ్మదేవుడు ఒక దివ్యరథాన్నీ వరంగా ఇచ్చాడనీ, ఆ రథంలో ఉన్నంతవరకూ మేఘనాథుడిని ఎవరూ ఏమీచేయలేరని రామలక్ష్మణులతో చెబుతాడు. ఆ దివ్యరథాన్ని పొందడం కోసమే మేఘనాథుడు యజ్ఞం చేస్తున్నాడనీ ... ఎలాంటి పరిస్థితుల్లోను అది పూర్తికాకుండా చూడాలని అంటాడు.
మేఘనాథుడు ఆ యజ్ఞాన్ని పూర్తిచేయకుండా చూడటం కోసం ఒకవైపున విభీషణుడు ప్రయత్నిస్తుంటాడు. మరోవైపున రాముడి అనుమతితో లక్ష్మణుడు రంగంలోకి దిగుతాడు. మేఘనాథుడు ఆ యజ్ఞం పూర్తిచేయకుండా లక్ష్మణుడు నిలువరించగలుగుతాడు. యజ్ఞం పూర్తిచేయకుండా వచ్చినందువలన మేఘనాథుడు యుద్ధరంగంలో కుప్పకూలిపోక తప్పలేదు. ఇలా యుద్ధసమయంలో విభీషణుడు రాముడికి సహకరించి ఆయనపట్ల తనకిగల భక్తివిశ్వాసాలను చాటుకున్నాడు ... ఆయన అనుగ్రహాన్ని అందుకున్నాడు.