మాఘమాసంలో నదీ స్నాన ఫలితం !
మాఘమాసం అత్యంత పవిత్రమైనదిగా ... విశిష్టమైనదిగా చెప్పబడుతోంది. మాఘమాసంలో తెల్లవారుజామున ఏ నదిలో స్నానం చేసినా, గంగానదిలో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. ఈ స్నాన ఫలితం కారణంగా మనసులోని కోరికలు నెరవేరుతాయి. గతంలోనూ ... పూర్వజన్మలలోనూ తెలిసీతెలియక చేసిన పాపాల నుంచి విముక్తి కలుగుతుంది.
పాపాల ఫలితమే జీవితంలో అభివృద్ధిని సాధించకుండా అడ్డుపడుతూ వుంటుంది. అనారోగ్యాలు ... ఆర్ధికపరమైన ఇబ్బందులు వేధిస్తూ వుంటాయి. ఈ పరిస్థితి అనేక దుఃఖాలకు కారణమవుతూ వుంటుంది. ఇలా జీవితాన్ని ఆవేదనామాయం చేసే బాధలన్నీ కూడా మాఘస్నాన ఫలితం కారణంగా దూరమైపోతాయి. అందువలన మాఘమాసంలో నదీస్నానం చేయడంలో నిర్లక్ష్యం చూపకూడదు.
ఈ మాసంలో అనునిత్యం నదీస్నానం చేసి సూర్యభగవానుడికి భక్తిశ్రద్ధలతో నమస్కరించాలి. శివకేశవులను అంకితభావంతో ఆరాధించాలి. భగవంతుడి నామ సంకీర్తనం చేయాలి ... పురాణపఠనం చేయాలి ... లేదంటే వినాలి. ఈ విధంగా చేయడం వలన ప్రస్తుతం ఏ లోటు కారణంగా అసంతృప్తితో జీవితం గడుస్తూ వుందో .. ఇక ముందుగానీ తరువాత జన్మలో గాని ఆ లోటు లేకుండా జీవితం కొనసాగుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
ఈ మాసంలో తెల్లవారుజామున నదీస్నానం చేయడం వలన ... స్తోమత కొద్దీ దానధర్మాలు చేయడం వలన విశేషమైన పుణ్యఫలితాలు లభిస్తాయని చెప్పబడుతోంది. ఈ స్నాన విశేషాన్ని తేలికగా తీసుకునేవాళ్లు ... చలికారణంగా బద్ధకించేవాళ్లు పుణ్య ఫలాలను పొందడానికి భగవంతుడు ఇచ్చిన ఒక అరుదైన అవకాశాన్ని వదులుకున్నట్టే అవుతుంది.