శివ పూజా సమయంలో చప్పట్లు కొట్టవచ్చా ?

సాధారణంగా కొన్ని దేవాలయాలకి వెళ్లినప్పుడు అక్కడి దైవానికి పూజ జరుగుతూ వుండగా .. నైవేద్యాన్ని సమర్పిస్తున్నప్పుడు భక్తులు చప్పట్లు కొడుతుంటారు. స్వామివారిని ఈ విధంగా ఆహ్వానించడం అక్కడి పద్ధతిగా కనిపిస్తూ వుంటుంది. అయితే శివుడికి సంబంధించిన విషయానికివస్తే, ఆయన పూజలో చప్పట్లు కొట్టకూడదాని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

చప్పట్లు కొట్టకుండానే ఆ స్వామిని ఆహ్వానించాలి ... ఆరాధించాలి ... సేవించాలి. ఇలా శివారాధనాలో ఎన్నో నియమాలు కనిపిస్తూ వుంటాయి. శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు ఒక పలుచటి వస్త్రం పైనపట్టి దానిలో నుంచి నీళ్లు శివలింగంపై ధారగాపడేలా పోయాలి. దీని వలన ఎలాంటి నలకలుగానీ .. సూక్ష్మ క్రిములుగానీ లేని పరిశుద్ధమైన నీటితో భగవంతుడికి అభిషేకం జరిపినట్టు అవుతుంది.

ఎప్పుడు అభిషేకం చేస్తున్నా మనసులోనే మహేశ్వరుడికి ముందుగా చెప్పుకుని ఆయన అనుమతి పొందినట్టుగా భావన చేసుకుని చేయాలి. అభిషేకానికి శివుడిని సిద్ధం చేయకుండా ఒక్కసారిగా శివలింగంపై అభిషేక ద్రవ్యం పోయకూడదు. ఇక అభిషేకం చేసేవారు విభూతిని ... రుద్రాక్షలను ధరించడం వలన లభించే ఫలితాలు కూడా విశేషంగా వుంటాయి.

స్వయంగా శివలింగానికి అభిషేకం చేసుకునే ఆలయాల్లో, భక్తులు శివలింగానికి అభిషేకం చేస్తున్నప్పుడు, తమ పాదాలు పానవట్టానికి గానీ, శివుడు కూర్చున్న వేదికకు గాని తగలకుండా చూసుకోవాలి. అలాగే పానవట్టంపై పూజా సంబంధమైన ఎలాంటి వస్తువులు పెట్టకూడదు. ఇలాంటి నియమాలు పాటిస్తూ చేసిన అభిషేకం పరిపూర్ణమైన ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా సోమవారం రోజున ... మాసశివరాత్రి ... మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో శివయ్యకు చేసే అభిషేకం వలన ఇహం లోను ... పరంలోను సుఖశాంతులు లభిస్తాయి.


More Bhakti News