సౌభాగ్య రక్షణనిచ్చే అమ్మవారు

స్త్రీలు తమ సౌభాగ్యరక్షణ కోరుతూ ఎన్నో వ్రతాలను ... పూజలను చేస్తుంటారు. వాళ్లు ఏ ఆలయానికి వెళ్లినా ... ఏ దైవాన్ని దర్శించినా తమ సౌభాగ్యాన్ని కలకాలం కాపాడుతూ ఉండమనే ప్రార్ధిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే వాళ్లు అమ్మవారి ఆలయాలను దర్శిస్తూ వుంటారు. అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ తల్లికి కుంకుమ పూజలు చేయిస్తుంటారు.

అమ్మవారిపట్ల గల ఆప్యాయతతో వాళ్లు పర్వదినాల్లో చీరసారెలు సమర్పిస్తుంటారు. అందువలన అమ్మవారి ఆలయాలు మహిళా భక్తులచే సందడిగా కనిపిస్తూ వుంటాయి. అలాంటి విశిష్టమైన అమ్మవారి ఆలయాలలో ఒకటి నల్గొండ జిల్లా 'నేరేడుచర్ల' లో కనిపిస్తుంది. సువిశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఇక్కడి ఆలయంలో 'కనకదుర్గాదేవి' దర్శనమిస్తూ వుంటుంది.

అమ్మవారిమూర్తిలోని తేజస్సు భక్తులను ఎంతగానో ప్రభావితం చేస్తుంటుంది. అమ్మవారి మహిమలు భక్తుల అనుభవాలుగా వెలుగుచూస్తోన్న కారణంగా, ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య అధికంగానే వుంటుంది. ఇక్కడి అమ్మవారిని పూజించడం వలన వివాహయోగం ... సంతాన భాగ్యం ... సౌభాగ్య రక్షణ కలుగుతాయని చెబుతుంటారు.

అమ్మవారి ఆశీస్సులు తీసుకుని ఆరంభించిన ప్రతిపని విజయవంతమవుతుందని విశ్వసిస్తుంటారు.దేవీ నవరాత్రుల్లోను ... కార్తీకమాసంలోను అమ్మవారికి ప్రత్యేక పూజలు ... ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా ఎంతోమంది భక్తులు అమ్మవారి సేవలో పాల్గొంటూ వుంటారు ... ఆ తల్లి కృపాకటాక్షాలతో తరిస్తుంటారు.


More Bhakti News