భగవంతుడి దర్శనానికి మించిన భాగ్యం లేదు
శ్రీమన్నారాయణుడు ధరించిన అవతారాలలో రామావతారానికి ఎంతో ప్రత్యేకత వుంది. ఎన్నికష్టాలు ఎదురైనా ధర్మమార్గంలో తాను ప్రయాణించి, అంతిమ విజయం ధర్మాన్ని మాత్రమే వరిస్తుందని శ్రీరాముడు ఈ లోకానికి చాటిచెప్పాడు. అందువల్లనే రాముడిని మూర్తీభవించిన ధర్మస్వరూపంగా చెబుతుంటారు. అలాంటి రాముడిని పూజిస్తూ ... స్మరిస్తూ తరించిన మహాభక్తులు ఎంతోమంది వున్నారు.
బోయవాడైన 'రత్నాకరుడు' రామనామాన్ని ఉపదేశంగా పొంది 'వాల్మీకి మహర్షి' గా ఈ లోకానికి రామాయణాన్ని అందించాడు. శ్రీరాముడు కనిపించిన దగ్గర నుంచి ఆయన సేవకే తనని తాను అంకితం చేసుకున్న హనుమంతుడు, ఆ స్వామి భక్తులకు దగ్గరి బంధువయ్యాడు. ఇక శ్రీరాముడి నామాన్ని స్మరిస్తూ ఆయన దర్శనభాగ్యం కోసం ఎంతోకాలంగా ఎదురుచూసిన 'శబరి' ... మోక్షాన్ని పొందింది.
వనవాస కాలంలో సీతారాములను తన పడవలో నదిని దాటించిన 'గుహుడు' ... అది తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఆ జ్ఞాపకంలోనే జీవించాడు. త్యాగరాజు ... తులసీదాసు ... కబీరుదాసు ... రామదాసు వీళ్లంతా కూడా రామనామాన్ని స్మరిస్తూ ... కీర్తిస్తూ, ఆయనే ధ్యాసగా ... శ్వాసగా జీవించారు. సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడి ప్రత్యక్షదర్శనాన్ని పొంది ధన్యులయ్యారు. ఇలా ఎంతోమంది మహానుభావులు రామనామమనే అమృతాన్ని పానం చేస్తూ ... గానం చేస్తూ తన్మయత్వంతో తరించారు.