దానగుణమే దారిద్ర్యం లేకుండా చేస్తుంది

భగవంతుడిని అందరూ పూజిస్తుంటారు ... సేవిస్తుంటారు. అయితే కొంతమంది మాత్రమే దానధర్మాలు చేయడానికి ముందుకి వస్తుంటారు. కొంతమంది తమకి ఉన్నదాంట్లోనే ఇతరులకి దానం చేస్తుంటారు. మరికొంతమంది భవిష్యత్తుకి సంబంధించిన అవసరాలను దృష్టిలో పెట్టుకుని సంపదను దాచుకుంటూ వుంటారు.

సంపదను పొదుపుగా ఖర్చుచేయడం మంచిదే కానీ, ఆ సంపదలో కొంత దానధర్మాలకు ఉపయోగించడం వలన అది మరింత పెరుగుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఎవరికివారు తమ సుఖసంతోషాల కోసం ధనాన్ని ఖర్చుచేయడం వలన ఎలాంటి పుణ్యం వచ్చి వారి ఖాతాలో చేరదు. కష్టాలలో ... ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం వలన, అది భగవంతుడికి ప్రీతిపాత్రుడిని చేస్తుందని చెప్పబడుతోంది.

కొంతమంది మహాభక్తుల జీవితాలు ఇందుకు నిదర్శనంగా కనిపిస్తుంటాయి. పోతన ఆర్ధికపరిస్థితి అంతంతమాత్రంగానే వున్నా, అందులోనే ఇతరులకు దానం చేయాడానికి ఆయన ఆరాటపడేవాడు. కబీరుదాసు కూడా అతిథులను ఆదరించడంలోనే అసలైన ఆనందముందని భావించేవాడు. వాళ్లకి భోజనంపెట్టి పంపించి తాను ఆనందంగా పస్తులుండేవాడు. ఇక తుకారామ్ కూడా భగవంతుడు ఇచ్చిన సంపద ద్వారా ఇతరులకు సాయపడటంలోనే సంతోషం వుందని భావించి, ధనధాన్యాలను దానధర్మాలకు ఉపయోగించేవాడు.

దానధర్మాలే భగవంతుడి ప్రీతికి పాత్రులను చేస్తాయి. అలాంటివారికి దారిద్ర్యం దరిచేరుతుందనే భయము ... బాధవుండవు. చేసిన ప్రతి దానం వెంటనే పుణ్యంగా మారిపోయి, అవసరమైన సందర్భంలో అది అనేకరెట్లు అధికంగా అందుతుంది. ముందుజన్మలలో ఆహారానికి ... నీటికి ఇబ్బందిపడకుండా కాపాడుతుంది. దానంగా ఇచ్చిన దానిని ఎక్కడ ఏ రూపంలో ఎవరి ద్వారా తిరిగి అందించాలో భగవంతుడికి తెలుసు. దానం చేసే దయామయులు దారిద్ర్యం బారిన పడకుండా ఆయనే చూసుకుంటూ వుంటాడు. అందుకే కలిగినంతలోనే దానం చేస్తుండాలి ... కరుణామయుడి అనుగ్రహాన్ని పొందుతుండాలి.


More Bhakti News