మాఘమాసంలో సూర్యభగవానుడి ఆరాధన !
ఇటు శుభకార్యాలకు ... అటు దైవకార్యాలకు అనుకూలమైనదిగా ... అత్యంత పవిత్రమైనదిగా 'మాఘమాసం' కనిపిస్తుంది. చాంద్రమానం ప్రకారం పదకొండవదిగా చెప్పబడుతోన్న ఈ మాసంలో పౌర్ణమి రోజున 'మఖ' నక్షత్రం వుండటం వలన ఇది 'మాఘమాసం' గా చెప్పబడుతోంది.
విశేషమైన పుణ్యఫలితాలను అందించేదిగా మాఘమాసం కనిపిస్తుంది. సాధారణంగా కొన్ని మాసాలలో పూజలు ... మరికొన్ని మాసాలలో దానధర్మాలు విశేషమైన ఫలితాలను ఇస్తాయని చెప్పబడుతోంది. ఇక మాఘమాసం విషయానికి వచ్చేసరికి ఈ మాసంలో 'నదీ స్నానం' విశేషమైనదని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
ఈ మాసంలో తెల్లవారుజామునే నదీస్నానాన్ని ఆచరించవలసి వుంటుంది. అందుకు అవకాశం లేకపోతే దగ్గరలోని చెరువులో స్నానాన్ని ఆచరించవలసి వుంటుంది. అందుకు వీలుకాకపోతే బావిలో నీటినే ... పుణ్యనదులలోని నీటిగా భావన చేసుకుని స్నానం చేయవలసి వుంటుంది. ఈ మాసమంతా తెల్లవారుజామున స్నానం చేయడం వలన, పుణ్యతీర్థాలలో స్నానమాచరించిన ఫలితం లభిస్తుందని చెప్పబడుతోంది.
స్నానం చేసిన అనంతరం సూర్యభగవానుడుని ఆరాధించడం ... శివకేశవులను పూజించడం ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. ఇక ఈ మాసంలో ప్రతి ఆదివారం రోజున సూర్యభగవానుడిని సేవించడం వలన అనారోగ్యాలు తొలగిపోతాయనీ, ఆయురారోగ్యాలు కలుగుతాయని స్పష్టం చేయబడుతోంది.