వేడుకోగానే వేదనలుతీర్చే వినాయకుడు
ఉదయాన్నే వినాయకుడిని దర్శించినా ... స్మరించినా ... పూజించినా ఆ రోజున పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయని చెప్పబడుతోంది. అందువల్లనే ఆయన అనుమతిని కోరుతూ ... అనుగ్రహాన్ని ఆశిస్తూ శుభకార్యాలు ఆరంభిస్తూ వుంటారు.
వినాయకుడి చిత్రపటంగానీ ... ప్రతిమకాని లేని ఇల్లంటూ వుండదు. అంతగా అందరూ వినాయకుడిని విశ్వసిస్తుంటారు. ఈ కారణంగానే వినాయకుడి ఆలయాలకి భక్తుల తాకిడి ఎప్పుడూ కనిపిస్తూ వుంటుంది. అలా భక్తులచే నిత్యనీరాజనాలు అందుకునే వినాయక క్షేత్రం'ఇరుసుమండ' లో అలరారుతోంది. తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండల పరిధిలో ఈ క్షేత్రం వెలుగొందుతోంది.
ఇక్కడి వినాయకుడుని భక్తులు ఎంతగానో ఆరాధిస్తూ వుంటారు. ఆయనకి నమస్కరించుకునే తమ ప్రయాణాలను ప్రారంభిస్తుంటారు. ఆయన ఆశీస్సులు అందుకునే కొత్తపనులకు శ్రీకారం చుడుతుంటారు. స్వామి అనుగ్రహం కారణంగా తలపెట్టిన ఏ కార్యమైనా ఎలాంటి అవాంతరాలు లేకుండా పూర్తవుతుందని చెబుతుంటారు. ఎలాంటి కష్టం కలిగినా స్వామికి చెప్పుకుంటేచాలు, ఆ కష్టం వెంటనే తీరిపోతుందని అంటారు.
పర్వాదినాల్లోనేకాదు ... పరీక్షా సమయాల్లోనూ విద్యార్థులు స్వామివారిని దర్శించుకుంటూ వుంటారు. ఆయన అనుగ్రహాన్ని కోరుకుంటూ వుంటారు. ఇలా ఇక్కడి వినాయకుడిని పూజించడం వలన కార్యసిద్ధి కలుగుతుందనీ, కష్టాలు తొలగిపోతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.