మాసశివరాత్రి రోజున రుద్రాభిషేకం

సదాశివుడు ఎక్కడ ఆవిర్భవించినా ... ఎక్కడ ప్రతిష్ఠించబడినా ఆయన కోరుకునేది దోసెడు నీళ్లతో అభిషేకమే. వివిధరకాల పుష్పాలతోకన్నా తనకి చల్లదనాన్ని ఇచ్చే బిల్వపత్రాలను సమర్పిస్తేచాలు ఆయన ఆనందంతో పొంగిపోతాడు. అంకితభావం వుండాలేగాని అనుగ్రహించడానికి ఆయన ఎంతమాత్రం ఆలస్యం చేయడు.

ఇక విశేషమైన రోజుల్లో స్వామి హృదయం మరింత విశాలమైపోతుంది. దాంతో సాధారణమైన రోజుల్లో కన్నా అనేకరెట్లు అధికంగా ఆయన భోగభాగ్యాలను అనుగ్రహిస్తుంటాడు. మోక్షమార్గంలో ప్రవేశించడానికి అవసరమైన అర్హతను ప్రసాదిస్తుంటాడు. అలాంటి విశేషాన్ని సంతరించుకున్న రోజుగా 'మాసశివరాత్రి' కనిపిస్తుంది. ఈ రోజు పరమశివుడికి ఎంతో ప్రీతికరమైనదిగా చెప్పబడుతోంది.

ఈ రోజున సాయంత్రం (ప్రదోషవేళ) ఆదిదేవుడి ఆలయానికి వెళ్లి రుద్రాభిషేకం చేయించి బిల్వదళాలను సమర్పించాలి. పరమశివుడిని స్తుతిస్తూ ... కీర్తిస్తూ ఉపవాసంతో కూడిన జాగరణ చేయాలి. ఆలయానికి వెళ్లే అవకాశంలేని భక్తులు పూజామందిరంలోగల శివలింగాన్ని అభిషేకించి బిల్వ పత్రాలతో పూజించవచ్చు. ఈ విధంగా సదాశివుడిని అర్చించడం వలన సదా ఆయన రక్షకుడిగా ఉంటాడని చెప్పబడుతోంది. రుద్రాభిషేక మహాత్మ్యం వలన ఆపదలు ... అనారోగ్యాలు ... దోషాలు తొలగిపోతాయి. మోక్షానికి అవసరమైన అర్హతతో పాటు సకలశుభాలు చేకూరతాయి.


More Bhakti News