సకల శుభాలనిచ్చే భగవంతుడి సేవ

ఏదైనా కష్టం కలిగినప్పుడు ... అనుకోని ఆపదలు ఎదురైనప్పుడు కొందరు భగవంతుడికి మొక్కుకోవడం, ఆ గండం నుంచి గట్టెక్కిన తరువాత మొక్కుచెల్లించి తమ దైనందిన వ్యవహారాల్లో పడిపోవడం చేస్తుంటారు. మరికొందరు తమ మనసులోని కోరిక నెరవేరడం కోసం భగవంతుడిని ఆశ్రయించి, అది కాస్తా నెరవేరగానే ఆయనకిచ్చిన మాటమేరకు కానుకలు సమర్పించి ఇక ఆలయానికి రావడం తగ్గించేస్తారు.

భగవంతుడి అనుగ్రహం కోసం ఆయనని ప్రార్ధించడం ... మొక్కుబడులు చెల్లించుకోవడం సహజమే. అయితే ఆయన వున్నది కేవలం తమ అవసరాలు ... కోరికలు నెరవేర్చడంకోసమే అన్నట్టుగా వ్యవహరించకూడదు. ఏదైనా సరే కోరుకోవడం వలన భగవంతుడు అంతవరకు మాత్రమే ప్రసాదిస్తాడు. తమకి ఏంకావాలో ఆయనకి తెలుసనే ఉద్దేశంతో సేవ చేస్తూ వెళితే, ఏ సమయానికి ఏది అవసరమో అది ఆయన అనుగ్రహంతో అందుతూనే వుంటుంది.

అందుకే వీలైనంత వరకూ భగవంతుడికి సమీపంగా ఉండటానికి ప్రయత్నిస్తూ వుండాలి. పూజద్వారాగానీ ... సేవద్వారా గాని ... స్మరణద్వారా గాని ఆయనని ఆరాధిస్తూ వుండాలి. ఆలయాల్లో దీపారాధనకి అవసరమైన నూనె ఇస్తుండాలి. అలాగే పూజకి అవసరమైన పువ్వులను అందజేస్తూ వుండాలి. భగవంతుడి తిరుమంజనానికి అవసరమైన చింతపండు ... హనుమంతుడి అభిషేకానికి అవసరమైన 'సిందూరం' ... బాబా మందిరాలకి అవసరమైన 'సాంబ్రాణి' ... కర్పూరం .. ఇలా భగవంతుడి సేవలో వినియోగించే ఏదైనా ఆయనకి అందజేస్తూ వుండాలి.

దేవాలయంలో శుభ్రంగా ఊడవడం ... వాకిట్లో ముగ్గుపెట్టడం కూడా సేవయే. ఇలా భగవంతుడి సేవకి ఎక్కడ అవకాశం లభిస్తే అక్కడ ఆయన సేవచేస్తూ వెళ్లాలి. ఇలా చేసేసేవ వలన భగవంతుడు ప్రీతిచెందుతాడు. అలా ఆయన సేవలో తరిస్తోన్నవారిని ఆపదలు ... అనారోగ్యాలు దరిచేరవు. ఒకవేళ అలాంటివి జరిగితే భగవంతుడిని గొంతెత్తి పిలవాల్సిన పనిలేదు. తనని సేవిస్తున్నవారిని ఆయన కనిపెట్టుకుంటూనే వుంటాడు ... కాపాడుతూనే వుంటాడు. అందుకే భగవంతుడిని సదా ప్రేమిస్తుండాలి ... పూజిస్తుండాలి ... సేవిస్తుండాలి. అపారమైన ఆయన కరుణామృతాన్ని అందుకుంటూ తరిస్తుండాలి.


More Bhakti News