పుణ్యరాశిని పెంచే తులసి ఆరాధన

విష్ణుమూర్తి ఆరాధనలో తులసిదళాలు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుని కనిపిస్తాయి. తులసిదళాలతో పూజ ... తులసిమాలలతో అలంకారం శ్రీమహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైనదని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అందువల్లనే వైష్ణవ సంబంధమైన ఆలయాలకు వెళుతున్నప్పుడు తప్పనిసరిగా తులసిదళాలను ... మాలలను తీసుకువెళ్లి భగవంతుడికి సమర్పిస్తుంటారు.

ఒక్క తులసిదళాన్ని తన పాదాలచెంత సమర్పించడం వలన, వివిధ రకాల పూలతో పూజించిన ఫలితం దక్కుతుందని స్వామివారే సెలవిచ్చాడని అంటారు. అందువలన పూజా మందిరాల్లోనూ స్వామివారిని తులసిదళాలతో పూజిస్తుంటారు. తులసి సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమనీ ... అందువలన స్వామివారు తులసికోటలో నివాసముంటాడని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే చాలామంది తమ ఇంట్లో తులసికోటను ఏర్పాటు చేసుకుంటూ వుంటారు. అనునిత్యం తులసికి నీళ్లు పోసి ... దీపం పెట్టి ... ప్రదక్షిణలుచేస్తూ పూజిస్తుంటారు.

గోవిందనామాలు చెబుతూ తులసిని పూజించడం వలన మరింత విశేషమైన ఫలితాలు దక్కుతాయి. గోవిందనామాలు చెబుతూ తులసిని పూజించడం వలన, సమస్తపాపాలు ... దోషాలు నశిస్తాయి. దారిద్ర్యం వలన కలిగే బాధలు ... వ్యాధులు దూరమైపోతాయి. సిరిసంపదలు ... సుఖశాంతులు చేరువవుతాయి. పుణ్యక్షేత్రాలను దర్శించిన ఫలితం ... దివ్యతీర్థాలలో స్నానమాచరించిన ఫలితం ... గోదానం చేసిన ఫలితం లభిస్తుందని చెప్పబడుతోంది. అందువలన తులసిపూజలో గోవిందనామాలు చెప్పడం మరచిపోకూడదు.


More Bhakti News