ముక్కనుమ రోజున కనిపించే సందడి !

బంధాలకు ... అనుబంధాలకు ప్రాముఖ్యతనిచ్చే పెద్దపండుగగా సంక్రాంతి కనిపిస్తుంది. అందువల్లనే సంక్రాంతికి అందరూ తాము పుట్టిపెరిగిన పల్లెలకు చేరుకుంటారు. ఆడపిల్ల నట్టింట్లో తిరగకపోతే పండుగ ఏదైనా దాని వాతావరణమే కనిపించదు. అందువలన ఈ పండుగకి కూతురినీ ... అల్లుడిని తప్పనిసరిగా ఆహ్వానిస్తుంటారు. భోగి ... సంక్రాంతి ... కనుమ ముగిసిన తరువాత, తమకి తోచిన రీతిలో వాళ్లకి కానుకలిచ్చి పంపిస్తుంటారు.

ఇక కొన్ని ప్రాంతాలలో కనుమ మరుసటి రోజుని 'ముక్కనుమ' గా పిలుచుకుంటూ వుంటారు. సంక్రాంతిలో భాగంగానే దీనిని జరుపుకుంటూ వుంటారు. భోగి మంటలతో భోగి ... సంబరాలతో సంక్రాంతి ... పశువుల పూజతో కనుమ తమ ప్రత్యేకతలను చాటుతాయి. ఇక ముక్కనుమ అనేది 'బొమ్మల నోము' అనే విశేషాన్ని సంతరించుకుని కనిపిస్తుంది.

కొత్తగా వివాహమైన అమ్మాయిలు బొమ్మల నోమును పడుతుంటారు. దీనినే సావిత్రీ గౌరీ వ్రతమని అంటారు. వివాహం కావలసిన కన్నెపిల్లలు కూడా ఈ బొమ్మలనోములో పాల్గొంటూ వుంటారు. ముత్తయిదువులను పేరంటానికి పిలిచి, మట్టిబొమ్మల మధ్య పసుపు గౌరీదేవిని వుంచి పూజిస్తారు. అమ్మవారికి వివిధ రకాల నైవేద్యాలను సమర్పిస్తూ ముత్తయిదువులకు పండ్లు ... తాంబూలం వాయనంగా ఇస్తారు.

ఈ విధంగా గౌరీదేవిని ఆరాధిస్తూ బొమ్మలనోము చేయించడం వలన సౌభాగ్యం కలకాలం నిలుస్తుందని అంటారు. కన్నెపిల్లలకు సద్గుణ సంపన్నుడైన యువకుడు భర్తగా లభిస్తాడని విశ్వసిస్తుంటారు. ఇలా ముక్కనుమ కూడా ఈ బొమ్మలనోము ద్వారా కోరిన వరాలను ప్రసాదిస్తూ తనదైన ప్రత్యేకతను ఆవిష్కరిస్తూ వుంటుంది.


More Bhakti News