ఈ రోజున విష్ణుమూర్తిని ఆరాధించాలి

సాధారణంగా 'ఏకాదశి' అనేది శుక్లపక్షంలో ఒకటి ... బహుళ పక్షంలో ఒకటి వస్తుంటాయి. ఇలా ఏకాదశి అనేది ఏడాదికి ఇరవైనాలుగు మార్లు పలకరిస్తుంది. ఏకాదశి వ్రతానికి గల మహాత్మ్యం అంతా ఇంతా కాదు. శ్రీమన్నారాయణుడి అనుగ్రహంతో భోగభాగ్యాలను ... ఉత్తమగతులను ప్రసాదించేదిగా ఏకాదశి వ్రతం కనిపిస్తుంది.

ఒక్కో ఏకాదశి ఒక్కో ప్రత్యేకతను ... విశిష్టతను సంతరించుకుని దర్శనమిస్తుంది. అలా పుష్యబహుళ ఏకాదశి రోజున వచ్చేది ' సఫల ఏకాదశి' గా చెప్పబడుతోంది. ఈరోజున శ్రీమహావిష్ణువుకి భక్తిశ్రద్ధలతో పూజాభిషేకాలు నిర్వహించడం వలన, తలపెట్టినకార్యాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సఫలీకృతమవుతాయని చెబుతారు. ఈ కారణంగానే దీని సఫల ఏకాదశిగా పిలుస్తుంటారు.

ఈ రోజున తెలియకచేసే ఉపవాసం ... జాగరణ కూడా విశేషమైన పుణ్యఫలితాలను ఇస్తాయని చెప్పబడుతోంది. ఈరోజున శ్రీమహావిష్ణువును పూజించి ఉపవాసంతో కూడిన జాగరణ చేయడం వలన అనంతమైన పుణ్యఫలాలు దక్కుతాయి. సంపదలు ... కీర్తిప్రతిష్ఠలు చేకూరతాయి. ముందుజన్మలకి అవసరమైన పుణ్యరాశి పెరుగుతుంది. ఈ రోజున నువ్వులు దానం చేయడం వలన శనిదేవుడు ప్రీతి చెందుతాడనీ, ఫలితంగా శనిదోష ప్రభావం తగ్గుతుందని చెప్పబడుతోంది. అందువలన దీనిని 'తిలైకాదశి' అని కూడా పిలుస్తుంటారు.


More Bhakti News