కనుమ పండుగ ప్రత్యేకత అదే !
సంతోషాలను ... సంబరాలను రాశిగా పోసినదిగా సంక్రాంతి పండుగ కనిపిస్తుంది. ఆహ్లాదకరమైన ... ఆధ్యాత్మికపరమైన ... ఆరోగ్యపరమైన వాతావరణాన్ని కల్పించే సంక్రాంతి ఎంతో విశిష్టతను ... మరెంతో ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది. భోగి భాగ్యాలను అందించగా .. సంక్రాంతి ఆ సంపదలను పంచుకోవడంలోని సంతోషాన్ని ఆవిష్కరిస్తుంది.
ఇక మూడవరోజున 'కనుమ పండుగ' పలకరిస్తుంది. సంపదలకు ... సంతోషాలకు కారణమైన పశువులను కృతజ్ఞతా పూర్వకంగా పూజించడమే కనుమ పండుగలోని ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది. వ్యవసాయంలో బసవన్నలు రైతులకు ఎంతగానో తమ సహకారాన్ని అందిస్తుంటాయి. అలాగే పాడి ద్వారా రైతన్నలను గోమాతలు ఆర్ధికంగా ఆదుకుంటూ వుంటాయి.
తమ యజమానిపట్ల ప్రేమతో తప్ప వాటి కష్టంలో ఎలాంటి స్వార్థం కనిపించదు. యజమాని ప్రేమతో నిమిరితే పొంగిపోవడం మాత్రమే వాటికి తెలుసు. ఆ కుటుంబం కోసం ఎంతటి కష్టాన్నయినా సంతోషంగా భరించడమే వాటికి తెలుసు. ధర్మస్వరూపమైన బసవన్నలు ... భూదేవి స్వరూపంగా చెప్పబడుతోన్న గోమాతలు ఇలా రైతన్నల అభివృద్ధికి తమవంతు కృషిచేస్తుంటాయి. అందువలన ఈ రోజున పశువులశాలను శుభ్రపరచి ... గోమాతలను ... బసవన్నలను ప్రేమతో ముస్తాబు చేస్తారు.
ఈ రోజున వాటిని ఎలాంటి పనికి ఉపయోగించకుండా పసుపు కుంకుమలతో అలంకరించి పూజిస్తారు. కొత్త ధాన్యంతో పొంగలిని తయారుచేసి వాటికి తినిపిస్తారు. మరికొంత పొంగలిని తమ పొలాల్లో చల్లుతారు. సహాయం చేసినవారికి కృతజ్ఞతలు తెలియజేసినవారు భగవంతుడి ప్రీతికి పాత్రులవుతారు. దాంతో ఆయన వాళ్లని కనిపెట్టుకుని వుంటాడు. అందువలన కనుమ రోజున పశువులను పూజించడం వలన పాడిపంటలు మరింత వృద్ధి చెందుతాయని చెప్పబడుతోంది.