కొత్త దంపతులు దర్శించవలసిన క్షేత్రం

త్రిపురాసురులను సంహరించడంలో పరమశివుడికి శ్రీమన్నారాయణుడు తోడ్పడ్డాడు. అందుకు కృతజ్ఞతగా రావణసంహారంలో తన అంశావతారమైన హనుమంతుడిగా శ్రీరాముడికి పరమశివుడు సహకరించాడని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

వైష్ణవ క్షేత్రాలకు శివుడు క్షేత్రపాలకుడిగా వ్యవహరిస్తూ వుండటం ... శైవ క్షేత్రాలకు విష్ణుమూర్తి క్షేత్రపాలకుడిగా వుండటం శివకేశవుల మధ్య గల అనుబంధానికి అద్దంపడుతుంటాయి. అలాంటి శివకేశవులను దర్శించుకోవడం భక్తులు తమ భాగ్యంగా భావిస్తుంటారు. అలాంటి అదృష్టాన్ని కలిగించే క్షేత్రంగా 'నందమూరు' కనిపిస్తుంది.

కృష్ణా జిల్లా పరిధిలో గల ఈ క్షేత్రంలో ఒకే ప్రాంగణంలో ఒక వైపున రామాలయం ... మరో వైపున శివాలయం దర్శనమిస్తూ వుంటాయి. ప్రాచీనకాలానికి చెందిన ఈ రెండు ఆలయాలు మహిమాన్వితమైనవిగా చెప్పబడుతున్నాయి. ఇటు వైష్ణవ సంబంధమైన పర్వదినాల్లోను ... అటు శైవసంబంధమైన పుణ్యతిథుల్లోను ఈ ఆలయాలలో ప్రత్యేక పూజలు ... విశేషమైన సేవలు జరుగుతుంటాయి.

ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ వివాహమైనా, కొత్తదంపతులకు ముందుగా ఈ ఆలయాలను దర్శింపజేస్తారు. ఈ ఆలయాలను కొత్తదంపతులు దర్శించడం వలన ... శివకేశవుల ఆశీస్సులు అందుకోవడం వలన వారి వైవాహిక జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సుఖసంతోషాలతో కొనసాగుతుందని విశ్వసిస్తుంటారు. అందువలన ఈ ఆలయాలని దర్శించేవారిలో కొత్త దంపతులు ఎక్కువగా కనిపిస్తుంటారు. శివకేశవులను భక్తిశ్రద్ధలతో పూజిస్తూ వారి అనుగ్రహాన్ని అర్ధిస్తూ వుంటారు.


More Bhakti News