బాబా దయతో దూరమయ్యే దారిద్ర్యం !

అమ్మలా ఆదరించడం ... నాన్నలా సంరక్షించడం శిరిడీ సాయిబాబాలో కనిపిస్తుంది. తన దర్శనం కోసం వచ్చే వాళ్లను బాబా ఎంతో ప్రేమగా పలకరించేవాడు. వాళ్ల కష్టనష్టాలను తెలుసుకుని అనుగ్రహించేవాడు. తనని విశ్వసించే భక్తులు ఆపదలో పడబోతుంటే ముందుగానే హెచ్చరించేవాడు. వాళ్లు ఆపదకి అతిచేరువుగా వెళ్లినప్పుడు క్షణాల్లో రక్షిస్తూ ఉండేవాడు.

ఇక ఆర్ధికపరమైన ఇబ్బందుల్లో ఉన్నవాళ్లకు ఆయన కొత్త ఆదాయ మార్గాలు చూపిస్తూ ఉండేవాడు. అందువలన వాళ్లు దారిద్ర్యం నుంచి బయటపడి, ఆనందంతో తమ జీవితాన్ని కొనసాగిస్తూ వుండేవాళ్లు. ఇలా అడుగడుగునా కాపాడుతూ బాబా అశేష ప్రజలకు దగ్గరయ్యాడు. అందువల్లనే ఆయా ప్రాంతాలలో బాబా ఆలయాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అలా బాబా భక్తుల సంకల్పబలంతో నిర్మించబడిన ఆలయాలలో ఒకటి 'రావులపాలెం' లో కనిపిస్తుంది.

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం - పార్కు సెంటరులో ఈ ఆలయం దర్శనమిస్తుంది. చూడచక్కగా తీర్చిదిద్దబడిన ఈ ఆలయం, బాబా భక్తుల అంకితభావానికి అద్దంపడుతూ వుంటుంది. శిరిడీలో మాదిరిగానే ఇక్కడి బాబాకి అలంకారాలు ... హారతులు ... ప్రత్యేక సేవలు జరుగుతుంటాయి. గురువారాల్లోను ... విశేషమైన రోజుల్లోనూ బాబా దర్శనం చేసుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా వుంటుంది.

ఇక్కడి బాబాను దర్శించుకోవడం వలన దారిద్ర్యం నుంచి విముక్తి లభిస్తుందని భక్తులు చెబుతుంటారు. ఆర్ధికపరమైన ఇబ్బందులతో సతమతమయ్యేవాళ్లు బాబాను దర్శించుకుని తమ ఆవేదనను వ్యక్తం చేస్తే చాలు, వెంటనే ఆ సమస్య నుంచి వాళ్లు బయటపడే దారిని బాబా చూపిస్తాడని అంటారు. బాబా అనుగ్రహం కోసం ఆరాటపడేవాళ్లతో ... ఆయన దయామృతాన్ని పొందినవాళ్లతో ఈ ఆలయం సందడిగా కనిపిస్తూ వుంటుంది. బాబా ఆశీస్సులను ... అభయాన్ని అందిస్తూ వుంటుంది.


More Bhakti News