మకరజ్యోతి దర్శనమే స్వామి నిదర్శనం !
గుండెల నిండా భగవంతుడిపట్ల విశ్వాసాన్ని నింపుకుని 'స్వామియే శరణమయ్యప్పా' అంటూ అయ్యప్ప స్వాములు చేసే శరణుఘోష, మనసును తట్టి భగవంతుడి సన్నిధిలో నిలుపుతుంటుంది. నిన్నమొన్నటి వరకూ ఏదైతే సుఖమని అనుకున్నామో, ఏదైతే సంతోషమని అనుకున్నామో అది తాత్కాలికమే. నిజమైన సుఖసంతోషాలు నీ సన్నిధిలో మాత్రమే లభిస్తాయని స్వాములు 'శబరిమల' బాట పడుతుంటారు.
'మకరజ్యోతి' దర్శనం చేసుకోవడం కోసం ఎన్నో ప్రాంతాల నుంచి భక్తులు కొండకోనలు దాటుతూ, ఆతృతగా ... ఆరాటంగా ముందుకు సాగుతుంటారు. మకరసంక్రాంతి రోజున అయ్యప్పస్వామి మూలమూర్తికి అలంకరింపజేసే ఆభరణాలు పందళ రాజవంశీయుల అధీనంలో వుంటాయి. మూడుపెట్టెల్లో అక్కడి నుంచి బయలుదేరిన తిరువాభరణాలు, సంక్రాంతి రోజుకి శబరిమలకు చేరుకుంటాయి. ఈ ఆభరణాలు గల పెట్టెలను మోసేవారు సైతం ఎంతో నియమనిష్టలను పాటిస్తూ వుంటారు.
స్వామివారి ఆభరణాలను రెండు గరుడ పక్షులు ఆకాశమార్గం నుంచి పర్యవేక్షిస్తూ రావడం, ఆయన మహిమకు నిదర్శనంగా కనిపిస్తుంటాయి. సంక్రాంతి సాయంత్రం వేళ స్వామివారికి ఆభరణాలు అలంకరించగానే, జ్యోతి దర్శనానికి సిద్ధంగా ఉండమని చెబుతూ ముందుగా ఆకాశంలో 'నక్షత్రం' కనిపిస్తుంది. లక్షల గొంతులు శరణుఘోష చెబుతూ వుండగా 'పొన్నంబలమేడు'లో మకరజ్యోతి దర్శనమిస్తుంది. అప్పుడు కలిగే ఆనందాన్ని వర్ణించడానికి అక్షరాలు చాలవు.
కనురెప్ప వేయకుండా భక్తులు జ్యోతిదర్శనం చేసుకుంటారు. కనురెప్పపాటు సమయం ఎంత విలువైనదనే విషయం అప్పుడే తెలుస్తుంది. తన దర్శనం కోసం వచ్చిన భక్తులంతా తనకి సమానమేనన్నట్టుగా అందరికీ స్వామి ఒకేలా జ్యోతిరూపంలో కనిపిస్తాడు. తానున్నాననే నిదర్శనాన్ని చూపుతూ, చిత్తశుద్ధితో భగవంతుడి సాక్షాత్కారాన్ని పొందడం తెలికనే విషయాన్ని చాటిచెబుతాడు.