దుష్టశక్తులను దూరంచేసే దేవదేవుడు
దేవతలకు ... మహర్షులకు ఏ కష్టమొచ్చినా వాళ్లు శ్రీమహావిష్ణువు సన్నిధికి చేరుకొని ఆయనకి చెప్పుకుంటారు. అప్పుడు స్వామి లోకకల్యాణం కోసం తన పథకరచన మొదలుపెడతాడు. ఆ ప్రకారం సమస్యను పరిష్కరించి అందరికీ సంతోషాన్ని కలిగిస్తాడు. ఈ నేపథ్యంలో స్వామి ధరించిన దశావతారాలలో నరసింహావతారం మరింత ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది.
అలా నరసింహ అవతారంలో హిరణ్యకశిపుడిని సంహరించిన అనంతరం స్వామి అనేక ప్రాంతాల్లో ఆవిర్భవించాడు. నరసింహస్వామి కొలువైన స్వయంభువు క్షేత్రాల్లో ఒకటిగా 'అప్పాజీపల్లి' కనిపిస్తుంది. మహబూబ్ నగర్ జిల్లా తిమ్మాజీపేట మండలం పరిధిలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. ఇక్కడి కొండపైగల గుహలో స్వామివారు స్వయంభువు మూర్తిగా దర్శనమిస్తుంటాడు.
ఎంతోమంది మహర్షులు ... మహాభక్తులు స్వామివారిని సేవించి తరించారని చెబుతారు. ఈ కొండపైకి అడుగుపెట్టడంతోనే దుష్టశక్తుల బారి నుంచి విముక్తి లభిస్తుందని అంటారు. శక్తిమంతమైన క్షేత్రంగా చెప్పబడుతోన్న ఈ కొండకి విశేషమైన పర్వదినాల్లో భక్తులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. స్వామిని పూజించడం వలన దోషాలు తొలగిపోతాయనీ, కోరిన కోరికలు నెరవేరతాయని చెబుతుంటారు.
ఈ కొండపై సహజసిద్ధంగా ఏర్పడిన గుండం కనిపిస్తుంది. ఇది మహిమాన్వితమైనదనీ ... ఇందులోని నీళ్లు తలపై చల్లుకున్నా ... తీర్థంగా స్వీకరించినా పాపాలు పటాపంచలై పోతాయని విశ్వసిస్తుంటారు. గ్రామస్తులంతా స్వామిని తమ ఇలవేల్పుగా భావించి పూజిస్తుంటారు. తామంతా చల్లగా ఉండటానికి ఆయన అనుగ్రహమే కారణమని నమ్ముతూ, అనునిత్యం ఆయన సేవలో తరిస్తుంటారు.