లక్ష్మీదేవి ఇక్కడ ఉండేందుకు ఇష్టపడుతుంది

ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలనే సామెత చాలా సందర్భాల్లో వినిపిస్తూ వుంటుంది. ఇల్లనేది ఇల్లాలి మనసును ప్రతిబింబిస్తూ వుంటుంది. పరిశుభ్రంగా ... పవిత్రంగా కనిపించే ఇల్లు, ఆ ఇల్లాలి తీరుకు అద్దంపడుతూ వుంటుంది. ఇల్లాలి కారణంగానే ఏ ఇల్లయినా కళకళలాడుతూ వుంటుంది.

ఇంటికి శోభని తెచ్చేది ... ఇంట్లోని సభ్యుల అవసరాలను గమనించి వారికి వాటిని అందించేది ఇల్లాలే. కుటుంబసభ్యుల కోసం ఆమె తన అవసరాలను ... సుఖసంతోషాలను పక్కనపెడుతుంది. వాళ్ల ముచ్చట తీర్చడం కోసం తాను ఎన్నో కష్టాలను అనుభవిస్తుంది. ఆ కష్టాలను బయటికి చెప్పుకోకుండా ఇష్టంగా స్వీకరిస్తుంది. తనవాళ్ల బాగుకోసం ఎన్నో త్యాగాలను చేస్తుంది.

ఎంతటి కష్టనష్టాలు ఎదురైనా తనవాళ్లకిగానీ, ఇరుగుపొరుగువారికిగాని తెలియకుండా సంసారాన్ని గుట్టుగా నెట్టుకు వస్తుంది. కొండంత భారాన్ని మోస్తూ ... కొవ్వొత్తిలా కరిగిపోతూ కూడా, సహనాన్ని కనబరుస్తూ సంతోషాన్ని ప్రదర్శించడం ఒక్క స్త్రీకి మాత్రమే సాధ్యమవుతుంది. అలాంటి స్త్రీ బాధపడిన చోట లక్ష్మీదేవి ఉండకుండా వెళ్లిపోతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

అందుకే స్త్రీ కన్నీళ్లు పెట్టకుండా చూసుకోవాలని పెద్దలు చెబుతుంటారు. స్త్రీ ఎక్కడైతే ప్రేమతో చూడబడుతుందో అక్కడ దేవతలు కొలువై ఉంటారని అంటారు. అందుకే ఎలాంటి పరిస్థితుల్లోను స్త్రీ మనసును నొప్పించకూడదు. ఆమె కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితులు కల్పించకూడదు. తనవాళ్ల కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడే స్త్రీని అంతాకలిసి ఎంతో ప్రేమగా చూసుకోవాలి. ఆమెకి ఆప్యాతానురాగాలను పంచుతూ ఆనందంగా ఉంచాలి. అలా స్త్రీ ఆనందంగా వున్న ఇళ్లలో మాత్రమే లక్ష్మీదేవి ఉండటానికి ఆసక్తిచూపుతుంది. ఆ ఇంట లేమి అనేది లేకుండా చేస్తుంటుంది.


More Bhakti News