సంక్రాంతి రోజున విశేష ఫలితాన్నిచ్చే దానం !
సంక్రాంతి పాడిపంటల పండుగ ... పల్లె అందాలను ... అనుబంధాలను ఆవిష్కరించే పండుగ. కొత్త పంటలు ఇంటికిచేరిన శుభసందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఆనందానుభూతులను పంచుకునే పండుగ. అందుకే ఈ పండుగ రోజున ఎవరి గ్రామాలకు వాళ్లు తరలివెళుతుంటారు. పాడిపంటలతో సిరి సంపదలనిచ్చి తమ అభివృద్ధికి కారణమైన పల్లె తల్లికి కృతజ్ఞతలు తెలుపుతుంటారు.
పంటనిచ్చిన సూర్యభగవానుడినీ ... పాడిని రక్షించిన విష్ణుమూర్తినీ ... ధాన్యం రూపంలో ఇంటికి తరలివచ్చిన లక్ష్మీదేవిని ఈ రోజున పూజిస్తారు. ఈ సంపదలకి ... సంతోషానికి కారణమైన భూదేవికి కొత్త పిండితో ముగ్గులుపెట్టి రంగులు దిద్దుతారు. ఆ ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలు పెట్టి వాటిని పూలతో అలంకరించి రేగుపండ్లు ఉంచుతారు. ఒక రకంగా ఇది భూదేవిని అలంకరించి ఆమెకి నైవేద్యాన్ని అందజేసినట్టుగా అవుతుంది.
మకర రాశికి అధిపతి 'శనేశ్వరుడు' కాబట్టి, దోష నివారణకుగాను నువ్వులు దానం చేస్తుంటారు. ఇక శివాలయంలో నువ్వుల నూనెతో దీపం పెట్టి, ఆయనకి ఆవునె య్యితో అభిషేకం చేయిస్తుంటారు. ఇక ఈ రోజున స్నానం ... దానం వలన విశేషమైన ఫలితాలు దక్కుతాయని చెప్పబడుతోంది. తలస్నానం వెనుక ఆరోగ్య సంబంధమైన అనేక కారాణాలు కనిపిస్తాయి.
ఇక దానం వలన అనేక రెట్లు అధికమైన ఫలితం ముందుజన్మలలో ఉపయోగపడుతుంది. ఈ రోజున పితృదేవతలను పూజించి వారి ఆశీస్సులు అందుకోవడం జరుగుతుంటుంది. కొత్త పంటలో ధాన్యం ముందుగా భగవంతుడి నైవేద్యానికి తీయడం జరుగుతుంది. ఆ తరువాత కొంత ధాన్యం ... కూరగాయలు ... పండ్లు ... బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వవలసి వుంటుంది. ఇక ఈ రోజున 'పెరుగు'ను కూడా తప్పని సరిగా దానంగా ఇవ్వాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
పెరుగును దానంగా ఇవ్వడం వలన మనోభీష్టం నెరవేరుతుందనీ, పాడి వృద్ధి చెందుతుందని అంటారు. ఇలా సంక్రాంతి పండుగ అనేది భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన ఆశీస్సులతో బంధుమిత్రువులతో కలిసి జరుపుకునేదిగా కనిపిస్తుంది. సంపద పంచుకుంటే పెరుగుతుందనే సందేశాన్ని ఇస్తుంటుంది. ఆప్యాతానురాగాలతో కూడిన ఆనందాన్ని తెస్తుంటుంది.