సూర్యభగవానుడికి ఆవుపాలతో అభిషేకం
సంక్రాంతి రోజున సూర్యభగవానుడు మకరరాశి రాశిలోకి ప్రవేశిస్తాడు కనుక దీనిని మకరసంక్రాంతి అంటారు. ఈ రోజు నుంచే ఉత్తరాయణం ఆరంభమవుతుంది. దక్షిణాయణం దేవతలకు రాత్రికాగా ... ఉత్తరాయణం పగలు. అందువలన ఉత్తరాయణం పుణ్యకాలంగా చెప్పబడుతోంది. ఈ కాలంలో చేసే శుభకార్యాలకు దేవతల ఆశీస్సులు లభిస్తాయనీ, ఫలితంగా ఆయాకార్యాలు ఆశించిన ప్రయోజనాలను ఇస్తాయని అంటారు.
అందువల్లనే ఈ కాలంలో వివాహాలు .. ఉపనయనాలు ... గృహప్రవేశాలు ... అక్షరాభ్యాసాలు ... వ్రతాలు విరివిగా జరుగుతూ వుంటాయి. ఇలా సంక్రాంతి రోజున ఉత్తరాయణ యాత్రను ఆరంభించే సూర్యభగవానుడు అనేక శుభాలను అందిస్తూ ముందుకు సాగుతుంటాడు కనుక, ఈ రోజున అంతా ఆయనని ఆరాధిస్తూ వుండాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
సంవత్సరమని చెప్పుకునే ఒకే చక్రం కలిగిన విశ్వమనే రథంపై సూర్యభగవానుడు ప్రయాణిస్తూ వుంటాడు. ఆయన కృపా కటాక్షాలతోనే అందరికీ ఆహారం సమకూరుతుంది ... ఆరోగ్యం చేకూరుతుంది. ఆ ప్రత్యక్షనారాయణుడి అనుగ్రహంతోనే సమస్త పాపాలు నశించి పుణ్యఫలాలు లభిస్తాయి. అలాంటి సూర్యభగవానుడిని కృతజ్ఞతా పూర్వకంగా అనుదినం పూజించాలి.
ముఖ్యంగా సంక్రాంతి రోజున తలస్నానం చేసి, స్వామిని ఆవుపాలతో అభిషేకించి ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి. ఈ రోజున సూర్యభగవానుడిని ఆవుపాలతో అభిషేకించడం వలన ... ఆదిత్య హృదయం పారాయణ చేయడం వలన ఆరోగ్యం ... ఐశ్వర్యం ... విజయం చేకూరతాయని స్పష్టం చేయబడుతోంది.