అభయాంజనేయుడిని ప్రార్ధిస్తే చాలు
అసమానమైన బలపరాక్రమాలు ... అంతకుమించిన వినయ విధేయతలు హనుమంతుడి సొంతం. అద్వితీయమైన ఈ లక్షణాలు సహజాభరణాలుగా ఆయన మహాతేజస్సుతో వెలుగొందుతూ వుంటాడు. సీతారాముల సేవలో తరించిన హనుమంతుడు, ఆ ఆదర్శదంపతుల అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాడు.
హనుమంతుడిని పూజించినవారికి సమస్తదోషాల నుంచి విముక్తి లభిస్తుందని శ్రీరాముడు సెలవిచ్చాడని అంటారు. అలాగే తనని సేవించినవారికి అష్టసిద్ధులను ... నవనిధులను ప్రసాదించే వరాన్ని హనుమంతుడికి సీతమ్మ ఇచ్చినట్టు చెప్పబడుతోంది. హనుమంతుడు ఎక్కడ వుంటే అక్కడికి సకలశుభాలు తరలి వస్తాయని భక్తులు విశ్వసిస్తుంటారు.
ఈ కారణంగానే అనేక ప్రాంతాలలో ఆయన ఆలయాలు దర్శనమిస్తూ వుంటాయి. అలాంటి విశిష్టమైన ఆలయాలలో ఒకటి 'ఫత్తేపురం' లో కనిపిస్తుంది. నల్గొండ జిల్లా నేరేడుచర్ల మండలం పరిధిలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. ఈ గ్రామంలో ప్రాచీనకాలం నుంచి ఈ 'అభయాంజనేయుడు' కొలువుదీరి ఉన్నాడని చెబుతారు. ఆరుబయటే వున్న హనుమంతుడిని గ్రామస్తులు పూజిస్తూ వుండేవారు.
స్వామివారి మహిమలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తూ ఉండటంతో, ఆయన అక్కడ ప్రత్యక్షంగా కొలువైవున్నాడనే విషయం భక్తులకు స్పష్టమవుతుంది. దాంతో అంతాకలిసి స్వామి ఎక్కడైతే ఉన్నాడో అక్కడే ఆయనకి ఆలయాన్ని నిర్మించారు. ఆరోజు నుంచి నిత్య ధూప దీప నైవేద్యాలు జరుపుతూ వస్తున్నారు. ఇప్పుడీ క్షేత్రం మహిమాన్వితమైన క్షేత్రంగా అలరారుతోంది.
మంగళవారాల్లో ప్రదక్షిణలు ... ఆకుపూజలు చేయించే భక్తులు ఎక్కువగా కనిపిస్తుంటారు. ఇక్కడి స్వామికి మనసులో మాట చెప్పుకుని ఆయన అనుగ్రహాన్ని కోరుతూ ప్రార్ధిస్తే అది తప్పక నెరవేరుతుందని అనుభవపూర్వకంగా చెబుతుంటారు. స్వామివారి సన్నిధిలోని సిందూరాన్ని ఇంటి గుమ్మానికి బొట్టుగా పెడితే ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించవని నమ్ముతుంటారు. ఈ సిందూరాన్ని నుదుటున ధరించడం వలన భయాందోళనలు దూరమవుతాయని చెబుతుంటారు.