అదే పరమాత్ముడి పరమాద్భుత లీలావిశేషం !
శ్రీనివాసుడిని చూసిన దగ్గర నుంచి పద్మావతీదేవి మనసు మనసులో వుండదు. అతని గురించే ఆలోచిస్తూ వుంటుంది. అంతకుముందు వరకూ భోగభాగ్యాలకు నిలయంగా కనిపించిన అంతఃపురం, ఇప్పుడామెకి బంగారు పంజరంగా అనిపిస్తూ వుంటుంది. అక్కడ ఆశ్రమంలో శ్రీనివాసుడు కూడా ఆమె గురించే ఆలోచిస్తూ వుంటాడు.
ఆయన చిన్నబోయి వుండటం గమనించిన వకుళామాత విషయమేవిటని అడుగుతుంది. తాను పద్మావతీదేవికి మనసిచ్చాననీ, ఆమెని వివాహం చేసుకుంటానని చెబుతాడు శ్రీనివాసుడు. ఆ మాట వినగానే వకుళామాత నిర్ఘాంతపోతుంది. పద్మావతీదేవికీ ... తమకి గల అంతరాన్ని ఆయనకి అర్థమయ్యేలా చెబుతుంది. ఆశకి పోవడం వలన అవమానాన్ని పొందవలసి వస్తుందని అంటుంది.
అయినా శ్రీనివాసుడు వినిపించుకోకుండా, వెళ్లి ఆకాశరాజు దంపతులతో ఈ విషయాన్ని మాట్లాడి రావలసినదిగా పట్టుపడతాడు. ఆయన మనసుకి కష్టం కలిగించడం ఇష్టం లేక వకుళామాత బయలుదేరుతుంది. మార్గమధ్యంలో ఎదురుపడి పలకరించిన నారద మహర్షికి ఆమె శ్రీనివాసుడి మనసులోని మాట చెబుతుంది.
శ్రీనివాసుడు ఈ వేడుకకు శ్రీకారం చుట్టినది ఆమె ముచ్చట తీర్చడం కోసమేనని నారదమహర్షి చెబుతాడు. ద్వాపర యుగంలో ఆమె యశోదాదేవి అనీ, శ్రీకృష్ణుడి వివాహాన్ని దగ్గరుండి జరిపించాలనే ఆమె ముచ్చట ఆ జన్మలో నెరవేరలేదని అంటాడు. ఆ కృష్ణుడే ఈ శ్రీనివాసుడనీ, అందుకే ఆమె కోరికను నెరవేర్చడానికి అంతగా ఆరాటపడుతున్నాడని వివరిస్తాడు. శ్రీకృష్ణుడి లీలావిశేషాన్ని తలచుకోగానే వకుళామాత కనులు ఆనంద బాష్పాలను వర్షిస్తాయి. పద్మావతీ శ్రీనివాసుల పరిణయ మహోత్సవాన్ని దగ్గరుండి జరిపించి తరించాలని భావించిన ఆమె, ఇక ఎటువంటి సంశయము లేకుండా అక్కడి నుంచి బయలుదేరుతుంది.