గొబ్బిళ్ళాటలోని ఆంతర్యం ఇదే !
సంక్రాంతి పండుగ సందర్భంగా పల్లెలన్నీ సంతోషాన్ని సంతరించుకుని కనిపిస్తుంటాయి. ఈ పండుగ మూడురోజులు కూడా ఆడపిల్లలు చేసే సందడి అంతాఇంతా కాదు. తలస్నానం చేసి ... కొత్తబట్టలు ధరించి ... ఇంటిని శోభాయమానంగా అలంకరించడంలో ఆడపిల్లలు ప్రధానమైన పాత్రను పోషిస్తుంటారు. ఉదయాన్నే వాకిట్లో కళ్లాపి చల్లి ... అందమైన ముగ్గులు పెడతారు ... రకరకాల రంగులు దిద్దుతారు. ఆ ముగ్గు మధ్యలో ఆవుపేడతో చేసిన 'గొబ్బెమ్మ' లను ఉంచుతారు.
కన్నెపిల్లలంతా ఆ గొబ్బెమ్మలకి పసుపు కుంకుమలతో బొట్లు పెడతారు. బంతి .. చామంతి .. గుమ్మడి .. బీర .. పొట్ల మొదలైన పూలతో అలంకరిస్తారు. ఆ తరువాత వలయాకారంలో గొబ్బెమ్మచుట్టూ తిరుగుతూ ... చప్పట్లు కొడుతూ పాటలు పాడతారు. తమ మనోభీష్టం నెరవేరేలా చేయమని గొబ్బెమ్మను కోరడమే ఈ పాటల్లోని పరమార్థంగా కనిపిస్తూ వుంటుంది.
పంటలు బాగా పండటం వల్లనే పాడి కూడా వృద్ధి చెందుతుంది. పాడిపంటలే సిరిసంపదలుగా సుఖసంతోషాలను ఇస్తుంటాయి. అలా తమ సుఖసంతోషాలకి కారణమైన భూదేవిని రంగవల్లికలతో అలంకరించి ... ఆటపాటలతో ఆ తల్లిని పూజిస్తూ వుండటం 'గొబ్బిళ్ళాట' ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది. ఇక సిరిసంపదలతోపాటు కొత్త జీవితాన్ని ఇవ్వమని కోరడం వలన, కన్నెపిల్లలకు మనసుకు నచ్చినవారితో వివాహం జరుగుతుందనే విశ్వాసం తరతరాల నుంచి వస్తున్నదే.