భోగి పండుగ రోజున బొమ్మల కొలువు
భోగి పండుగ రోజున చాలామంది తమ ఇంట్లో 'బొమ్మల కొలువు' ను ఏర్పాటు చేస్తుంటారు. బొమ్మల కొలువును చూడటానికి రమ్మని చుట్టుపక్కలవారిని బొట్టుపెట్టి మరీ ఆహ్వానిస్తుంటారు. సహజంగానే బొమ్మలంటే ఇష్టపడే పిల్లలు తమ తల్లితో కలిసి ఆ పేరంటానికి వెళుతుంటారు. అందువలన ఈ రోజున బొమ్మల కొలువు ఏర్పాటుచేసినవారి ఇళ్లలో మరింత సందడి కనిపిస్తూ వుంటుంది.
అంచెలంచెలుగా బల్లాలు ఏర్పాటు చేసి వాటిపై వివిధరకాల బొమ్మలను వుంచుతుంటారు. వైకుంఠంలో లక్ష్మీ సమేతుడైన నారాయణుడు .. సత్యలోకంలో బ్రహ్మదేవుడు - సరస్వతి ... కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు కొలువుదీరిన విధానం బొమ్మలుగా ముచ్చట కలిగిస్తుంటాయి. అలాగే శ్రీమన్నారాయణుడు ధరించిన దశావతారాల ఘట్టాలు బొమ్మలుగా కనులముందు దర్శనమిస్తుంటాయి.
రావణుడితో శ్రీరాముడి యుద్ధం ... హనుమంతుడు సంజీవిని పర్వతం తీసుకురావడం ... శ్రీరాముడి పట్టాభిషేక మహోత్సవం ... శ్రీకృష్ణుడి లీలావిశేషాలకు సంబంధించిన దృశ్యాలు ఆనందాశ్చర్యాలు కలిగిస్తుంటాయి. పల్లెల్లోని ప్రజలు ... వారి జీవన విధానాన్ని ప్రతిబింబించే వస్తువులు బొమ్మలుగా అలరిస్తుంటాయి. ఇక వివిధ రకాల పక్షలు ... పశువులు ...వృక్షాలు ... జంతువులు ... కీటకాలు ... సంగీత సాధనాలు బొమ్మలుగా కనిపిస్తుంటాయి.
ఈ బొమ్మలన్నీ ఒక దగ్గర చూసిన పిల్లలకి కలిగే సంతోషం అంతా ఇంతా కాదు. ఈ బొమ్మల కొలువుకి రావడం వలన పిల్లలకు రామాయణ భారత భాగవతాలకి సంబంధించిన విషయాలు తెలుస్తాయి. సమాజంలో గల వివిధ వృత్తులు ... వారి జీవన విధానాన్ని గురించి తెలుసుకునే అవకాశం కలుగుతుంది. వివిధ రకాల పక్షులు ... పశువులు ... జంతువుల గురించి తెలుసుకుంటారు.
పిల్లలు పదిమార్లు చదివితే గ్రహించే విషయాన్ని దృశ్యరూపంగా ఒక్కసారి చూస్తే గ్రహిస్తారు. వినోదంతో పాటు విజ్ఞానం జోడించబడి ఉండటమే అందుకు కారణం. అందువల్లనే బోగి రోజున ఏర్పాటు చేసే బొమ్మల కొలువు పిల్లలకు ఒక విజ్ఞాన కేంద్రమేనని చెప్పవచ్చు. అది వాళ్లకి మానసికపరమైన ఉల్లాసాన్ని ... ఉత్సాహాన్ని అందిస్తుంది. ఇలా బొమ్మల కొలువు పేరుతో ఒకరింటికి ఒకరు రాకపోకలు సాగించడం వలన, అటు పెద్దలమధ్య ... ఇటు పిల్లలమధ్య స్నేహ పూర్వక సంబంధాలు మరింత పెరుగుతుంటాయి. అందువలన బోగి పండుగ రోజున బొమ్మలకొలువు అనేది ఎంతో ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.