భోగాలను అందించే భోగి

సంక్రాంతి ... పాడిపంటలకు సంబంధించిన పండుగ. సిరిసంపదలనిచ్చే పాడిపంటలను తమకి సమృద్ధిగా అందించిన భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ గ్రామీణులు జరుపుకునే పండుగ. అందువలన ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా సందడి చేస్తుంటుంది.

పంటనిచ్చిన సూర్యభగవానుడినీ ... పాడినిచ్చిన విష్ణుమూర్తినీ ... ధాన్యం రూపంలో తమ ఇంటికి చేరిన లక్ష్మీదేవిని పూజిస్తూ, ఈ సంతోషానికి కారణమైన నేలతల్లిని ముగ్గులతో ముచ్చటగా అలంకరించి ఆనందిస్తూ జరుపుకుంటారు. మూడు రోజులపాటు జరుపుకునే ఈ పండుగలో మొదటిరోజున 'భోగి' సందడి మొదలవుతుంది. ఈరోజు ఉదయాన్నే ఆవుపేడతో చేయబడిన పిడకలతో ఉత్సాహంగా 'భోగిమంటలు' వేస్తుంటారు. ఇంట్లోను ... పరిసరాల్లోను నిరుపయోగంగా పడివున్న చెక్కవస్తువులను ఈ మంటలో పడేస్తుంటారు.

ఈ విధంగా చేయడం వలన ఇల్లు ... పరిసరాలు పరిశుభ్రమవుతాయి. అనారోగ్యాన్ని కలిగించే వ్యాధికారక క్రిములు ఈ మంటల్లో ఆహుతయైపోతాయి. మరునాడు నుంచి ఉత్తరాయణ యాత్రను ఆరంభించబోతోన్న సూర్యభగవానుడికి, పరిశుభ్రమైన పరిసరాలతో స్వాగతం పలకాలనే ఉద్దేశం భోగిమంటల్లో అంతర్లీనంగా కనిపిస్తుంది.

భోగిమంటలు వేసిన తరువాత వేడినీటితో తలస్నానం చేసి ... నూతనవస్త్రాలను ధరించి ... వాకిట్లో రంగవల్లులు దిద్ది 'గొబ్బెమ్మలు' వుంచుతుంటారు. కొత్త ధాన్యంతో చేసిన 'పొంగలి'ని భగవంతుడికి నైవేద్యంగా సమర్పించి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వుంటారు. ఈ రోజున సాయంత్రం చిన్న పిల్లలకు 'రేగుపండ్లు'తో దిష్టితీసి తలపై నుంచి పోస్తుంటారు. శ్రీమన్నారాయణుడికీ ... సూర్యభగవానుడికి అత్యంత ప్రీతికరమైన రేగుపండ్లుతో భోగిపండ్లు పోయడం వలన దిష్టిదోషాలు తొలగిపోయి, స్వామి ఆశీస్సులతో ఆయురారోగ్యాలు లభిస్తాయి.

ఈ రోజునే గోదాదేవి రంగనాయకస్వామిని వివాహమాడింది కనుక, వైష్ణవ సంబంధమైన ఆలయాలలో ఘనంగా వారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడం వలన సకలశుభాలు చేకూరతాయి. ఇలా ఆధ్యాత్మిక పరమైన ... ఆరోగ్యపరమైన వరాలను అందించేదిగా, ఉత్తరాయణ పుణ్యకాలానికి సంతోషంగా స్వాగతం పలికేదిగా భోగిపండుగ కనిపిస్తుంది. అరిష్టాలను తొలగించి ఆయురారోగ్యాలతో కూడిన భోగాలను అందిస్తుంది.


More Bhakti News